calender_icon.png 22 February, 2026 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది ఫాంటసీ టైమ్ బ్రో !

22-02-2026 12:00:00 AM

సాధారణ మానవ ప్రపంచాన్ని అద్భుత శక్తులు, దైవిక ప్రపంచంతో ముడి పెడుతూ కథను నడిపించే సోషియో ఫాంటసీ సినిమాలు సగటు ప్రేక్షకులకు పైసా వసూల్ అనిపిస్తాయి. ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో ఈ జానర్ సినిమాలకు ఉన్నంత ఆదరణ మరో జానర్‌కు లేదనే చెప్పాలి. తెలుగులో ఈ తరహా చిత్రాలు గతంలో ఎప్పుడో ఓసారి వచ్చేవి. కానీ, ఇటీవల మైథలాజికల్ టచ్ ఉన్న సోషియో ఫాంటసీ సినిమాల జోరు పెరిగింది. 

టాలీవుడ్ ఇప్పుడు ఫాంటసీ ప్రపంచంలో విహరిస్తోంది. సోషియో ఫాంటసీకి మైథాలజీ టచ్ ఇస్తూ కొత్త కథలను చెప్పే పనిలో  మేకర్స్ బిజీగా ఉన్నారు. పురాణ, ఇతిహాస, జానపద గాథలకు సైన్ ఫిక్షన్‌తో కూడిన యాక్షన్ థ్రిల్ జోడించడమే ఇక్కడ న్యూ ట్రెండ్‌గా మారింది. కొంత కాలంగా ఈ జోనర్‌లో వచ్చిన కార్తికేయ, హనుమాన్, కల్కి2898ఏడీ, కాంతార  (అనువాదం) వంటి సోషియో ఫాంటసీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర విజయవంతమయ్యాయి.

దీంతో యువ కథానాయకుల నుంచి స్టార్ హీరోల దాకా ఇలాంటి కథలపైనే మనసు పారేసుకుంటున్నారు. సోషియో ఫాంటసీ చిత్రాలంటేనే భారీ గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ లాంటి భారీ సాంకేతికతతో కూడుకున్న పని. ఇదంతా ఎంతో రిస్క్ అని తెలిసి కూడా సినీప్రియులకు సరికొత్త అనుభూతినిచ్చేందుకు మేకర్స్ ఈ జోనర్ చిత్రాల నిర్మాణం వైపు మొగ్గుచూపుతున్నారు. 

అప్‌కమింగ్ సినిమాలు ఇవే.. 

మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోయే సినిమాల్లో ‘విశ్వంభర’ ఒకటి. దీన్ని దర్శకుడు వశిష్ట భారీ సోషియో ఫాంటసీ, విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు. నిర్మాణపరమైన చిక్కుల్లో పడిన నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించడంలేదు. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ భారీ సోషియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ చిత్రం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది.

ప్రభాస్ హీరోగా నాగ్‌అశ్విన్ రూపొందిస్తున్న ‘కల్కి2’ షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ లేని సీక్వెన్స్‌ను షూట్ చేస్తారు. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ, స్పిరిట్ షూటింగుల్లో బిజీగా ఉన్నారు. దీంతో టీమ్ అమితాబ్‌తో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ఈ పనిమీదే బిగ్‌బీ హైదరాబాద్ చేరుకున్నారట. రిషబ్ శెట్టి కథానాయకుడిగా ప్రశాంత్‌వర్మ- తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ నుంచి అప్పట్లో విడుదల చేసిన ఫస్ట్‌లుక్ అంచనాలు పెంచేసింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులకు ముందుకు రావాల్సి ఉంది.

‘నాగబంధం’ కూడా భారీ పాన్-ఇండియా యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ చిత్రం. ‘ద సీక్రెట్ ట్రెజర్’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. విరాట్ కర్ణ హీరో కాగా నభా నటేశ్, ఐశ్వర్యా మీనన్ కథానాయికలు. జగపతిబాబు, మురళీశర్మ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇది పురాతన విష్ణు దేవాలయాలు, నాగబంధం రహస్యాల చుట్టూ తిరిగే కథ.

మహా శివరాత్రి సందర్భంగా మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. 2026 వేసవిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అలాగే త్రివిక్రమ్ తెరకెక్కించనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ కూడా ఈ జోనర్‌లోనే రూపొందుతుందని సమాచారం. 

గతమెంతో ఘనం! 

చరిత్ర పుటలను ఒక్కసారి తిరగేసి చూస్తే.. తెలుగులో ఫాంటసీ సినిమాలకు పునాది వేసింది ‘పాతాళ భైరవి’ చిత్రమే. ఎన్టీరామారావు కథానాయకుడిగా 1951లో విడుదలైన ఈ సినిమా తెలుగులో తీసిపోని ఓ చిత్రరాజం. ఆ తర్వాత 1977లో విడుదలైంది ‘యమగోల’. ఒక సామాన్యుడు యమలోకానికి వెళ్లి యమధర్మరాజుతో వాదించే ఈ చిత్రం సోషియో ఫాంటసీలో కొత్త ట్రెండ్ సృష్టిం చింది.

చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ (1990) ఒక ఐకానిక్ ఫాంటసీ డ్రామా. ఇక తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన టైమ్ ట్రావెల్ మూవీల్లో చెప్పకోదగ్గది బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘ఆదిత్య 369’. ‘భైరవద్వీపం’ (1994) కూడా మంత్రతంత్రాలు, అద్భుత శక్తులతో నిండిన ఒక విజువల్ వండర్. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం ఆయన కెరీర్‌లో ప్రముఖ స్థానంలో నిలిచింది.

1994లో అలీ ప్రధాన పాత్రలో వచ్చిన ‘యమలీల’ అత్యంత ప్రజాదరణ పొందింది. యముడు, చిత్ర గుప్తుడు తమ భవిష్యవాణి పుస్తకం కోసం భూలోకానికి రావడం అనే హాస్యభరితమైన కథాంశంతో సాగు తూ ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. ఒక సామాన్యుడు ఈగగా పుట్టి ప్రతీకారం తీర్చుకోవడం అనే వినూత్న ఫాంటసీ కథాంశంతో 2012లో వచ్చిన చిత్రం ‘ఈగ’. ‘ఓ బేబీ’ (2019)..

ఒక 70 ఏళ్ల వృద్ధురాలు మళ్లీ 24 ఏళ్ల యువతిగా మారే ఫాంటసీ కామెడీతో అలరించింది. ‘బింబిసార’ (2022).. ఒక పురాతన చక్రవర్తి ప్రస్తుత కాలానికి రావడం వంటి అంశాలతో సాగే టైమ్ ట్రావెల్ మూవీ ఇది. అంతేకాక ‘యమదొంగ’, అంజి, దేవుళ్లు, కార్తికేయ 2, మగధీర, అరుంధతి, హనుమాన్, కల్కి 2898 ఏడీ, ఓదెల 2 వంటి సోషియో ఫాంటసీ చిత్రాలు ఆదరణ పొందాయి.  

సాంకేతికత తోడైనా తడబాటు ఎందుకో..? 

ఒకప్పుడు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండానే సహజమైన వాతావరణంలో రూపొందించిన సినిమాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. కాలక్రమేణా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ అన్ని పరిశ్రమలకూ చేరువైంది. మరి ఇలాంటి సమయంలో వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ విషయంలో తడబడుతున్నారనే విమర్శలు టాలీవుడ్ మేకర్స్‌ను వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఇటీవల సోషియో ఫాంటసీ తరహా చిత్రాలు తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకోకపోతున్నాయి. ఫలితంగా గతమెంతో ఘనం అన్న చందంగా మారింది టాలీవుడ్ పరిస్థితి.

ఇటీవల ఎంతో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది రాజాసాబ్’ ప్రభాస్ అభిమానులతో సహా సినీప్రియులను అత్యంత నిరుత్సాహానికి గురిచేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్థానికంగా వీఎఫ్‌ఎక్స్ పనులు చేపట్టడమే ఇందుకు కారణమని చర్చ ఇప్పటికీ సాగు తోంది. ఇదే సంస్థలో తేజ సజ్జ హీరోగా రూపొందిన ‘మిరాయ్’ విషయంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందరి దృష్టి ‘విశ్వంభర’పై పడింది. చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయి చాలా కాలమే అయినా విడుదలకు నోచుకోవడం లేదు. ప్రచారంలో భాగంగా విడుదల చేసిన టీజర్‌లో వీఎఫ్‌ఎక్స్ లోపాలు కనిపించాయి. దీంతో మరింత మెరుగ్గా తీర్చిదిద్దే పనిలో పడిన మేకర్స్ ఎలాంటి కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారోనన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

సాంకేతికత పరిజ్ఞానం సామాన్యుడూ పెంచుకుంటూ మూవీ మేకింగ్‌లోని లోపాలను గ్రహిస్తున్నాడు. ఇంతటి టెక్నాలజీ లేని కాలంలో వీఎఫ్‌ఎక్స్‌తో పని లేకుండానే సినిమాలు మెప్పు పొందటం వెనుక ఉన్న రహస్యం.. అప్పుడు సోషల్ మీడియా లేకపోవడం, సాంకేతికత పరిజ్ఞానం సగటు మనిషికి చేరువ కాకపోవటమే! ఇప్పుడంతా అరిచేతిలో ప్రపంచం.. దీన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటే వాట్ ఏ మే‘కింగ్’ అనిపించుకోవచ్చు.