08-02-2026 12:51:07 AM
మాజీ మేయర్ వై సునీల్‌రావు
కరీంనగర్, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి): నగరాభివృద్ధిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాత్ర లేదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని బీజేపీ నాయకులు, కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్‌లో శనివారం విలేకరుల సమావేశంలో సునీల్ రావు మాట్లాడు తూ నగరం అభివృద్ధిలో బీఆర్‌ఎస్ పాత్ర ఉందని ప్రజలను మభ్యపెట్టే వాఖ్యలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేయడం చాలా దుర్మార్గం అన్నారు.
2017 లో కరీంనగర్ నగరపాలక సంస్థకు స్మార్ట్ సిటీ హోదా వస్తే.. 2020 వరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోవడానికి కారణాలు ఏమిటో ఎమ్మెల్యే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.నగరపాలక సంస్థ అభివృద్ధిలో బండి సంజయ్ కుమార్ తన బాధ్యత ను సమర్థవంతంగా నెరవేర్చిన ప్రజల నా యకుడని కొనియాడారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్ గా పని చేసి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా, ప్రస్తుతం కేంద్రమంత్రిగా నగర ప్రజలకు విశేషసేవలు అందించిన గొప్ప నాయకులు బండి సంజయ్ అని అన్నారు.
గత ఐదేళ్లలో కరీంనగర్ నగరంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు కళ్ల ముందు కనబడుతుందన్నారు. 2017 లో కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా ప్రకటిస్తే... 2020 జనవరిలో మేము మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసే వరకు కేవలం రూ.19 లక్షల అభివృద్ధి పనులే జరిగాయన్నారు. కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదా వచ్చినప్పటికీ 2019 లో బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచే వరకు కేంద్ర ప్రభుత్వం నుండి స్మార్ట్ సిటీ కి నిధులు విడుదల రాకపోవడానికి కారణాలు ఏంటో కమలాకర్ చెప్పాలన్నారు.
కరీంనగర్ ఎంపిగా బండి సంజయ్ కుమార్ గెలిచిన తర్వాతే మొదటి సారిగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ కు 196 కోట్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ఇచ్చినప్పటికీ రెండున్నరేళ్లు కరీంనగర్‌కు నష్టం చేసింది ఎమ్మెల్యే గా ఉన్న గంగుల కమలాకర్ కాదా... అని ప్రశ్నించారు.
బండి సంజయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.196 కోట్లు విడుదల చేసినా ఏడాది పాటు ఆ నిధులను కార్పొరేషన్‌కు ఎందుకు విడుదల చేయలేదని, ప్ర శ్నించారు. రైల్వేఓవర్‌బ్రిడ్జ్ నిర్మాణంలో స్థలసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. స్థల సేకరణ చేయకుండా జాప్యం చేసింది అనా డు ఎవరనేది చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.