27 March, 2026 | 4:26 AM

ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలనడం సమంజసం కాదు

27-03-2026 02:41 AM

మంగపేట, మార్చి 26 (విజయక్రాంతి): పేద బడుగు బలహీన వర్గాల పాలిట దైవం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని తొలగించాలనడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, మాజీ ఎంపీటీసీ అయ్యోరి యానయ్య అన్నారు.

మండలంలోని కోమటిపల్లి క్రాస్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయ్యోరి యానయ్య మాట్లాడుతూ ఇటీవల కొంతమంది గిరిజన నాయకులు మంగపేట మండలంకు సంబందించిన పలు విషయాలపై ఏటూరునాగారం ఐటిడిఏలో జరిగిన గ్రీవేన్స్ లో, మంగపేట తహశీల్ కార్యాలయంలో వినతి పత్రాలు అందించారన్నారు. అయితే ఆ వినతి పత్రాలలో పేర్కొన్న మిగతా విషయాల గురించి తాము ఏ మాత్రం మాట్లాడదల్చుకోలేదని గంపోనిగూడెం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలన్న ఒక్క విషయాన్ని మాత్రమే తాము ఖండిస్తున్నామన్నారు.

నేడు పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ముఖ్యంగా ఆదివాసీలకు అందుతున్న సంక్షేమ పధకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య కారణం ఎన్టీఆర్ చలువే అన్నారు. ఎన్టీఆర్ ఓ వర్గానికో, ఓ పార్టీకో సంబందించిన వ్యక్తి కాదని, ఎన్టీఆర్ కొందరివాడు కాదని అందరివాడని అన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం తొమ్మిది ఐటిడిఏలు ఏర్పాటు చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు. గిరిజన పిల్లల విద్య కోసం గిరిజన గ్రామాలలో బడులు, హాస్టల్స్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఈ సమావేశంలో చాద మల్లయ్య, కొమురం సారయ్య, కొమురం బాలన్న, లక్ష్మీపతి , పొడెం నాగేష్, తోలెం రాంబాబు, నరేందర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.