ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ విద్వేషాలను రెచ్చగొట్టడం సబబు కాదు
బోధన్, జూలై 21 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు పార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బోధన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు రెంజల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు కార్తీక్ యాదవ్ మాట్లాడుతూ, ఈ నెల 18న బీఆర్‌ఎస్ నిర్వహించిన ‘యువ సంగ్రామ సభ‘లో ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సబబు కాదని విమర్శించారు.
అలాంటి వ్యాఖ్యలను కేటీఆర్ సమక్షంలో చేయించడం హేయమైన చర్య అని ఆరోపించారు. యూత్ కాంగ్రెస్ తలచుకుంటే బీఆర్‌ఎస్ నాయకులు బయట తిరగలేరని హెచ్చరిస్తూ, యువత బీఆర్‌ఎస్ నాయకుల మాటలు నమ్మి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉందని, ప్రతి ఒక్కరికీ చట్టం ప్రకారం న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అబ్బోల్ల శ్రీకాంత్, అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాయినాథ్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు సురేష్, శ్రీకాంత్, సుశాంత్, చింటూ, సీనియర్ నాయకుడు నిరాడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.






