19 August, 2026 | 10:17 PM

ఇస్మాయిల్ ఖాన్ గూడ స్మశాన వాటిక వివాదం

19-08-2026 08:31 PM

తాహసిల్దార్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల ఎదుట స్థానిక ప్రజల ధర్నా

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధి, ఇస్మాయిల్ ఖాన్ గూడ లోని స్మశాన వాటిక స్థలం ఆక్రమణకు గురవుతోందంటూ దానిని కాపాడాలనే డిమాండ్‌తో స్థానిక ప్రజలు బుధవారం ఘట్కేసర్ సర్కిల్, తాహసిల్దార్ కార్యాలయాల ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న ఈ శ్మశానవాటిక భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు  ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.

స్మశాన వాటిక కాంపౌండ్ వాల్, ఇతర నిర్మాణాలను రాత్రికి రాత్రే కూల్చివేసేందుకు కొందరు యత్నించారని,  బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని శ్మశాన వాటిక స్థలానికి స్పష్టమైన సరిహద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా స్థలానికి చేరుకున్న మేడ్చల్ డిసిసి అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి, మేడ్చల్ డిసిసి ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్  వచ్చి స్థానిక ప్రజలతో మాట్లాడటం జరిగింది. ప్రభుత్వంతో మాట్లాడి మీకు న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు వారి నిరసన విరమించారు.