30 May, 2026 | 3:50 AM

నీ చూపు పడలేని ప్రేమే నాదేనా..

30-05-2026 01:13 AM

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన సొంత బ్యానర్ ‘వాట్ నెక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’లో నిర్మిస్తున్న తొలిచిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, మహేశ్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు వదిలిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘హాయ్ రే’ను విడుదల చేశారు.

నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన ఈ పాట ఆకట్టుకుంటోంది. థమన్ స్వరపర్చిన ఈ పాటను అనిరుధ్ రవిచందర్, సంజన, హర్షవర్ధన్ ఆలపించారు. ఇందులో కళ్యాణ్ చక్రవర్తి రాసిన సాహిత్యం.. హీరోయిన్‌ను దూరం నుంచి ప్రేమించే హీరో భావాలను అందంగా వ్యక్తపరిచింది. కన్ను దాటి జారే నీటిలో దాచుకున్న ప్రేమే నువ్వని.. గొంతులోనే ఆగే మాటలో చెప్పుకోని బాధే నువ్వని.. అడుగులుగా కదిలినదే... హాయ్ రే... నీ చూపు పడలేని ప్రేమే నాదేనా..’ అంటూ సాగుతోందీ గీతం. త్వరలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.