24 July, 2026 | 1:58 AM

పాతాళానికి భూగర్భజలం?

24-07-2026 12:19 AM
  1. రోజురోజుకు పడిపోతున్న భూగర్భ జలాలు 
  2. అడుగంటుతున్న రిజర్వాయర్లు 
  3. ఆందోళన చెందుతున్న రైతులు

కరీంనగర్/సిరిసిల్ల, జూలై 23 (విజయ క్రాంతి): కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు భారీగా పడిపోయాయి. రిజర్వాయర్లు రోజురోజుకు అడుగంటుతున్నాయి. దీంతో రైతులు ఖరీఫ్ సాగు సాగేదెలా అని ఆందోళన చేస్తున్నారు. కరీంనగర్ పట్టణంలో ఫిబ్రవరితో పోలిస్తే నాలుగు నెలల్లోనే జలాలు 4.62 మీటర్లు పడిపోయాయి. కరీంనగర్ అర్బన్, చొప్పదండి, గంగాధర, చిగురుమామిడి, మానకొండూర్ మండలాల్లో అరమీటరు నుండి 1.7 మీటర్ల వరకు నీటి మట్టాలు క్షీణించాయి. జిల్లాలోని లోయర్ మానేర్ డ్యామ్, ఇతర ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు అడుగంటాయి. వర్షాలు లేకపోవడంతో చాలా వరకు వ్యవసాయ బోర్లు ఎండిపోయే దశకు చేరుకున్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో,రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భజలాలు క్రమంగా అడుగంటుతున్నాయి. రాష్ట్ర భూగర్భ జల శాఖ నివేదికల ప్రకారం జిల్లాలో సగటు భూగర్భ జల మట్టం 12.26 మీటర్లకు పడిపోయింది. మునుపటి ఏడాదితో పోలిస్తే జిల్లాలో సగటున సుమారు 2.91 మీటర్ల మేర భూగర్భ జలాలు క్షీణించాయి. అత్యధికంగా వేములవాడ అర్బన్ మండలంలో భూగర్భ జల మట్టం ఏకంగా 21.38 మీటర్ల లోతుకు పడిపోయింది. వీర్నపల్లి, రుద్రం గి, చందుర్తి, సిరిసిల్ల మండలాల్లో కూడా గణనీయమైన స్థాయిలో నీటి మట్టాలు పడిపోయి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అత్యల్పంగా బోయినపల్లి మండలంలో 7.82 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి.

ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల మధ్యమానేరు, ఎగువ మానేరు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండకపోవడం, ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి నీటిని  ఎత్తిపో యకపోవడం, సాగు విస్తీర్ణం పెరగడంతో బోర్లు, బావుల వినియోగంతో ఉపరితల నీటి వనరులు, చెరువులు ఎండిపోతున్నాయి.

రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాల పరిరక్షణకు అధికారులు వర్షపు నీటి సంరక్షణ చర్యలు, ఇంకుడు గుంతలు, పంట కుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా కందులు, పెసలు, మినుములు వంటి తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.