8 August, 2026 | 5:33 PM

Breaking News

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు   •   శ్రీవాణి లో బోనాలు, గోరింటాకు సంబరాలు   •   ప్రభుత్వ సెలవుల్లోనూ ప్రైవేట్ స్కూళ్లు ఓపెన్!   •   ముగింపు దశకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ఐపీఎస్‌ విద్యార్థి సత్తా   •   బోర్లగూడెం కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీ మండలంగా ప్రకటించాలి   •   రెండవ దశ ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపు   •   ఫారం పండు పనులతో భూగర్భ జలాలు పెంపు.   •   నో పార్కింగ్‌ బోర్డులు.. అయినా అదే తీరు!   •   క్విట్‌ ఇండియా స్ఫూర్తితో కార్మిక కోడుల రద్దు వరకు ఉద్యమిద్దాం   •  

బీఆర్ఎస్ హెచ్చరిస్తేనే కేఎల్‌ఐ పంపులు ఆన్ చేశారా?

08-08-2026 03:13 PM

రైతులకు సాగునీరు ఇవ్వకుండా రిజర్వాయర్లకే పరిమితం

నార్లాపూర్ ముట్టడి హెచ్చరికల తర్వాతే ప్రభుత్వం కదిలిందన్న బీఆర్ఎస్

వనపర్తి,(విజయక్రాంతి): కేఎల్‌ఐ పరిధిలోని ఎల్లూరు, జొన్నలబొగడ, గుడిపల్లి రిజర్వాయర్ల నుంచి రైతులకు సాగునీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ లు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

హెచ్చరికల తర్వాతే మోటార్లు ఆన్ చేశారా? 

కేఎల్‌ఐపై బీఆర్ఎస్ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఈ నెల 11న నార్లాపూర్ రిజర్వాయర్‌ను ముట్టడిస్తామని ప్రకటించిన తర్వాతే ప్రభుత్వం పంపులను ప్రారంభించిందని నాయకులు ఆరోపించారు. అంతకుముందు ఎల్లూరు, జొన్నలబొగడ రిజర్వాయర్లలో పరిమితంగానే మోటార్లు నడిచాయని, ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో ఒక్కో మోటారుతోనే నీటిని ఎత్తిపోస్తున్నారని పేర్కొన్నారు.

రిజర్వాయర్లకు నీళ్లు.. రైతులకు ఎక్కడ? 

ఎల్లూరు, జొన్నలబొగడ, గుడిపల్లి రిజర్వాయర్లను తాగునీటి అవసరాల కోసం నింపే ప్రయత్నం చేస్తున్నారే తప్ప రైతులకు సాగునీరు అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గుడిపల్లి నుంచి ఇప్పటికీ కాలువలకు సాగునీరు విడుదల కాలేదని అన్నారు. కేఎల్‌ఐ పరిధిలోని సుమారు 500 చెరువులు, కుంటలను నింపి రైతులకు ప్రయోజనం కల్పించాలని డిమాండ్ చేశారు.

వరద జలాలను సద్వినియోగం చేసుకోవాలి 

మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి జూరాలకు భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఆ నీటిని సద్వినియోగం చేసుకుని రిజర్వాయర్లను నింపాలని నాయకులు కోరారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జూరాల నీటి లభ్యతను ముందుగానే అంచనా వేసి రిజర్వాయర్లను నింపి పంటలకు సాగునీరు అందించిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం సాగునీటి వినియోగంలో విఫలమవుతోందని విమర్శించారు.

 ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రకటన ప్రజల్లో చులకన

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై చేసిన విమర్శలను వారు తప్పుబట్టారు. ప్రాజెక్టులు, సాగునీటి అంశాలపై అవగాహన లేకుండా ప్రకటనలు చేయడం వల్ల ప్రజల్లో చులకన అవుతున్నారని ఆరోపించారు. కేఎల్‌ఐ పరిధిలో పంపులను నిరంతరాయంగా నడిపే అవకాశం ఉన్నందున వానాకాలం, యాసంగి పంటలకు సాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్ డిమాండ్ చేశారు.