ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి హతం
- మా సైన్యం దాడుల్లో ఇస్మయిల్ ఖతీబ్ మృతి చెందాడన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్
- ఆయన మరణాన్ని ధ్రువీకరించని ఇరాన్
టెహ్రాన్/టెలీ అవీవ్, మార్చి 18: అమెరికా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగు తున్న యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీఖమేని మృతి తర్వాత ఇరాన్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. టెహ్రాన్ పై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మయిల్ ఖతీబ్ మృతి చెందారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ బుధవారం ప్రకటించారు. ఇరాన్ సీనియర్ అధికారులు ఎవరినైనా సరే ఎలాంటి అదనపు అనుమతులూ అవసరం లేకుండా హంతం చేయా లని మిలిటరీకి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు పూర్తి అభయం, స్వేచ్ఛ ఇచ్చినట్టు ఆయన తెలిపారు.
అయితే ఇస్మయిల్ ఖతీబ్ మృతి వార్తలను ఇరాన్ ఇంకా ధ్రువీకరించలేదు. ఇస్మయిల్ ఖతీబ్ మృతికి ఒక రోజు ముందే ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ సైతం ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. ఆయనతో పాటు ఇరాన్ రెవెల్యూషనరీ గారడ్స్ కోర్(ఐఆర్జీసీ) పారామిలిటరీ దళం ‘బసిజ్ ఫోర్స్’ కమాండర్ గోలం రెజా సోలేమానీ, పెద్ద సంఖ్యలో మిలిటరీ ఉన్నతాధికా రులు తమ దాడుల్లో మృతిచెందినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో ఒక పక్క కీలక నేతలు ఒక్కొక్కరు మరణిస్తుండడం,
మరోపక్క ఆ దేశ ఆర్థిక శక్తిగా ఉన్న ఇంధన, క్షిపణులు, సైనిక స్థావరాలు ధ్వంసం కావడంతో ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. అయితే ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఆదేశంలోని 100 లక్ష్యాలను లక్ష్యంగా చేసుకున్నట్టు ఇరాన్ తెలిపింది. ఉద్రిక్తతలను తగ్గించే ప్రతిపాదనను ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తిరస్కరించారు. శాంతికి ఇది సమయం కాదని, పరాజయాన్ని అంగీకరించి నష్టపరిహారం ఇచ్చేంత వరకూ అమెరికా, ఇజ్రాయెల్‌తో శాంతి కుదరదని హెచ్చరించారు.
మొజ్తాబాను వెతికివెతికి చంపేస్తాం
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీని ఎక్కడున్నా వెతికి పట్టుకొని చంపేస్తామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్‌కి ముప్పు కలిగించే ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవడాన్ని కొనసాగిస్తామని, తమ దేశానికి వ్యతిరేకంగా చేయి ఎత్తిన వారు మా నుంచి తప్పించుకోలేరని, తరిమి, తరిమి అంతం చేస్తామని ఐడీఎఫ్ ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడు, ఎక్కడ అనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేకపోయినా.. మా టార్గెట్ మాత్రం మిస్ కాదని, అయితే మొజ్తాబా ఆచూకీపై తమ వద్ద సమాచారం లేదని ఎఫీ డెఫ్రిన్ తెలిపారు.




