యుద్ధంలోకి ఇరాన్ మస్కిటో ఫ్లీట్స్!
హోర్ముజ్ జలసంధిలో ఫాస్ట్ బోట్స్ నిఘా
అమెరికా చమురు నౌకలను పేల్చేస్తున్న దోమలదండు
చమురు రవాణా మార్గాలపై గస్తీ
ఈ అటాక్ బోట్ల ద్వారా శక్తివంతమైన క్షిపణుల ప్రయోగం
ఎలాంటి యుద్ధనౌకనైనా క్షణాల్లో ధ్వంసం
సంద్రంలోనూ శత్రువులను వేటాడే టెక్నాలజీ
టెహ్రాన్, మార్చి 12: ప్రపంచాన్ని గడగడలాడించేందుకు ఇరాన్ వద్ద ఉన్న ఏకైక ఆయుధం హోర్ముజ్ జలసంధి. దీన్ని సంధిస్తే ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం కావాల్సిందే. అన్ని దేశాలూ ఇంధనం కొరతతో విలవిలలాడాల్సిందే.
అలాంటి అత్యంత ప్రధానమైన జలసంధి వద్ద ప్రపంచానికి చమురు నౌకలను వదలకుండా నిరంతరం పహారా కాస్తోంది దోమలదండు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన వేళ, గల్ఫ్ జలాల్లో ఇరాన్ తన అత్యంత ప్రమాదకరమైన మస్కిటో ఫ్లీట్‌ను రంగంలోకి దింపింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్‌కి చెందిన వందలాది చిన్న తరహా వేగవంతమైన అటాక్ బోట్లు ఇప్పుడు అంతర్జాతీయ చమురు రవాణా మార్గాల్లో పహారా కాస్తున్నాయి. ఈ చిన్న బోట్లు చూడటానికి సాధారణంగా ఉన్నప్పటికీ, వీటిలో నస్, కౌసర్, ఘదర్, జాఫర్, అబు మహదీ వంటి శక్తివంతమైన క్షిపణులను అమర్చారు.
ఇవి ఎంతటి పెద్ద యుద్ధనౌకలనైనా క్షణాల్లో నాశనం చేయగలవు. సముద్ర ఉపరితలంపైనే కాకుండా, నీటి లోపల కూడా శత్రువును దెబ్బతీసేందుకు ఇరాన్ తన మినీసబ్‌మెరైన్లను సైతం హోర్ముజ్‌లో ఏర్పాటు చేసింది. ఇవి రాడార్లకు చిక్కకుండా శత్రునౌకల సమీపంలోకి వెళ్లి మెరుపు దాడి చేయగలవు. శత్రు విమానాలు, నౌకలు దాడికి ప్రయత్నిస్తే తీరం నుంచే క్షిపణుల వర్షం కురిపించేలా ఇరాన్ వ్యూహరచన చేసింది. మస్కిటో ఫ్లీట్‌గా పిలిచే ఈ చిన్న పడవలదే కీలకపాత్ర. దాదాపు 10 టన్నుల బరువుతో ఉండే ఈ రకం ఫాస్ట్ బోట్స్ 1,500 వరకు ఇరాన్ ఐఆర్బీసీ నేవీ వద్ద ఉన్నాయి.
టెహ్రాన్‌కు చెందిన భారీ నౌకలను ధ్వంసం చేశామని సంబరపడుతున్న అమెరికాకు ఇవి ఇప్పుడు షాకిస్తున్నాయి. ఇటువంటివి 300 వరకు ఉన్నట్లు అంచనా. ఈ పడవలు కేవలం 50 లేదా 110 నాట్స్ వేగంతో ప్రయాణించగలవు. సముద్రంపై చురుగ్గా కదలగలవు. గుంపుగా ఈ చిన్నబోట్లు దాడిచేస్తే.. భారీ యుద్ధ నౌకల టార్గెటింగ్ వ్యవస్థలు కూడా సమస్యలను ఎదుర్కొంటాయి. కొన్నాళ్ల క్రితం హోర్ముజ్‌లో జరిగిన యుద్ధ విన్యాసాల్లో 40 బోట్లు పాల్గొన్నాయి. వాస్తవానికి ఈ జలసంధి ఇరుకుగా ఉండటంతో పెద్ద నౌకలు వేగంగా అవసరమైన దిక్కుకు మళ్లే అవకాశాలు లేవు. ఇదే ఈ దోమలదండుకు కలిసి వస్తున్న అంశం. ఇటీవల జనవరిలో ఐఆర్జీసీ విడుదల చేసిన వీడియోలో ఓ భూగర్భ స్థావరంలో పెద్ద సంఖ్యలో ఈ డ్రోన్‌బోట్లు ఉన్నాయి.
ఇరాన్ దళాలకు అనుబంధంగా పనిచేసే హూతీలు ఇప్పటికే డ్రోన్ బోట్లను వినియోగించారు. చిన్న ఫైబర్స్ లేదా చెక్క పడవలను మానవ రహిత బోట్లుగా తీర్చిద్దారు. ఇప్పటికే కువైట్ వద్ద సోనాంగ్ నమిబే, ఇరాక్ సమీపంలో సేఫ్సీ విష్ణు, జెఫిరోస్ ట్యాంకర్లపై వీటిని ప్రయోగించినట్టు అనుమానిస్తున్నారు. ఇక ఇరాన్ దళాల వద్ద అజదార్ అనే మానవ రహిత అండర్ వాటర్ వెహికల్ కూడా ఉంది. ఇది నాలుగు రోజుల పాటు 600 కిలోమీటర్ల రేంజిలో గస్తీ కాయగలదు. అవసరమైతే నౌకలపై దాడి కూడా చేస్తుంది. దీనిని సైలెంట్ కిల్లర్‌గా వ్యవహరిస్తారు.




