12 April, 2026 | 12:16 PM

అమెరికాతో చర్చల అనంతరం స్పందించిన ఇరాన్ విదేశాంగ శాఖ

12-04-2026 10:28 AM

టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్థాన్‌లో జరుగుతున్న చర్చల్లో ఏర్పడిన ప్రతిష్టంభనకు, అమెరికా మితిమీరిన డిమాండ్ల వల్ల ఒప్పందానికి రాలేకపోయామని ఇరాన్ విదేశాంగ శాఖ ఆదివారం పేర్కొంది. ఇరాన్ ప్రజల జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఇరాన్ ప్రతినిధి బృందం 21 గంటల పాటు నిరంతరాయంగా, తీవ్రంగా చర్చలు జరిపింది. ఇరాన్ ప్రతినిధి బృందం పలు చొరవలు తీసుకున్నప్పటికీ, అమెరికా పక్షం అసమంజసమైన డిమాండ్లు చర్చల పురోగతిని అడ్డుకోవడంతో చర్చలు ముగిశాయని ఇరాన్ తెలిపింది. చర్చల సందర్భంగా వివాదాస్పద అంశాలు లేవనెత్తారని, హర్మూజ్ జలసంధి, అణు హక్కుల వంటి వివాదాస్పద అంశాలు ప్రస్తావించారని ఇరాన్ మండిపడ్డింది. 

మితిమీరిన డిమాండ్లు, చట్టవిరుద్ధమైన అభ్యర్థనలకు అమెరికా దూరంగా ఉండాలని,  ఏమీ తేలకుండానే అమెరికాతో చర్చలు ముగిశాయని ఇరాన్ విదేశాంగశాఖ వెల్లడించింది. ఒకే విడత చర్చల్లోనే ఒక ఒప్పందానికి చేరుకుంటామని ఎవరూ ఆశించకూడదని మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయీ పేర్కొన్నారు. తమకు పాకిస్తాన్‌కు, అలాగే ఈ ప్రాంతంలోని మా ఇతర మిత్రులకు మధ్య సంబంధాలు కొనసాగుతాయని తెహ్రాన్ విశ్వసిస్తోందని ఆయన వెల్లడించారు.

ప్రపంచ చమురు రవాణాలో సుమారు ఐదవ వంతుకు కీలక జలమార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పరిసరాలతో పాటు, అణు పదార్థాల తొలగింపు వంటి అంశాలకు సంబంధించి యుద్ధం ద్వారా తాము సాధించలేని రాయితీలను అమెరికా కోరిందన్నారు. అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, తాము తమ తుది, ఉత్తమ ప్రతిపాదనతో ఇస్లామాబాద్ నుండి వెళుతున్నామని చెప్పిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వెలువడింది. ఇరానియన్లు దీనిని అంగీకరిస్తారో లేదో చూద్దామని ఆయన అనేక విడతల చర్చల అనంతరం విలేకరులతో అన్నారు.