29 July, 2026 | 3:42 PM

పులుల సంరక్షణకు కదిలిన అటవీ సిబ్బంది

29-07-2026 02:53 PM

అచ్చంపేట, మన్ననూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం

బైక్‌ ర్యాలీతో అవగాహన

అచ్చంపేట, జూలై 29: ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌(Amrabad Tiger Reserve) పరిధిలో పులుల సంరక్షణ, అటవీ జీవ వైవిధ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. అచ్చంపేట, అమ్రాబాద్ అటవీ డివిజన్ల పరిధిలోని వివిధ రేంజ్‌లకు చెందిన అటవీ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అచ్చంపేట ఫారెస్ట్ కాంప్లెక్స్‌ నుంచి బస్టాండ్‌ వరకు అటవీ సిబ్బంది భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

మన్ననూరులోనూ బైక్‌ ర్యాలీ చేపట్టి పులుల సంరక్షణ ఆవశ్యకత, వన్యప్రాణుల రక్షణ, అటవీ జీవ వైవిధ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అచ్చంపేట ఫారెస్ట్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అచ్చంపేట ఫారెస్ట్ డివిజనల్ అధికారి, ఏసీఎఫ్‌ చంద్రశేఖర్, అమ్రాబాద్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి రామమూర్తి, ఫ్లయింగ్ స్క్వాడ్ డివిజనల్ అధికారి రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఫీల్డ్‌ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. పులుల సంరక్షణ ప్రతి అటవీ ఉద్యోగి బాధ్యత అని పేర్కొన్నారు. వన్యప్రాణుల రక్షణలో అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తూ, అడవుల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.

విద్యార్థులకు బహుమతులు

అచ్చంపేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్‌ స్కూల్‌లో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులను అధికారులు అభినందించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లు, ఎగ్జామ్ ప్యాడ్‌లను బహుమతులుగా అందజేశారు. కార్యక్రమాల్లో అచ్చంపేట, అమ్రాబాద్ అటవీ డివిజన్లకు చెందిన ఫీల్డ్‌ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.