ఎడతెరిపి లేని వర్షాలు.. ఉప్పొంగుతున్న వాగులు
వట్టి వాగు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వట్టి వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు రెండు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి.వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ కె. హరిత బుధవారం ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి వాగు వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రానున్న మూడు రోజుల పాటు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ప్రజలు అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.
వరద నీరు వంతెనలపై ప్రవహించే పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వంతెనలు దాటరాదని, ద్విచక్ర వాహనదారులు, పశువుల కాపరులు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు.వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 8500844365 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.తుంపెల్లి వాగు పరిశీలనలో తహసీల్దార్ రియాజ్ అలీ, పోలీసు సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.






