ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి అహ్మద్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని పట్టణంలోని స్థానిక హనుమాన్ దేవాలయం వద్ద సోమవారం పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి అహ్మద్ ఆలయ పరిసరాలను సందర్శించి పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆలయ ఆవరణలో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని తొలగించారు.
ఆలయ సమీపంలో లీకేజీ అవుతున్న పైప్‌లైన్‌కు మరమ్మత్తులు చేశారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ తరపున అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు అనుమండ్ల శ్రీకాంత్, శ్రీరాములు, సాయి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




