జవహర్ నగర్ లో ఇందిరమ్మ క్యాంటీన్ ఏర్పాటుకు సహకరించండి
జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు అశోక్ విజ్ఞప్తి
జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ లో ఇందిరమ్మ క్యాంటీన్ (ఐదు రూపాయల భోజనం) ఏర్పాటుకు సహకరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు చింతకింది అశోక్ విజ్ఞప్తి చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ బాలాజీ నగర్ ప్రాంతంలో అడ్డా భవన నిర్మాణ హమాలీ కార్మికుల కోసం ఐదు రూపాయల భోజన పథకాన్ని (ఇందిరమ్మ క్యాంటీన్) ఏర్పాటు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంతను సోమవారం కలసి వినతి పత్రం సమర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ... అడ్డా కార్మికులకు రోజువారి కూలి దొరకడం గగనమైన పరిస్థితుల్లో కూలీలందరూ అర్థాకలితో అలమటిస్తూ, పస్తులు ఉంటున్నారని తెలిపారు. వారి జీవితం నిత్యం ఒక పూట భోజనమేనని, వారి క్షుబాధను తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వానిదని తెలిపారు. జవహర్ నగర్ ప్రాంతంలో సుమారు 300కు పైగా కార్మికులు ఉపాధి కోసం ప్రతిరోజు అడ్డాల వద్ద పడి కాపులు పడుతున్నారని వీరిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం త్వరగా ఇందిరమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కోరారు. గరీబోళ్లకు అడ్డాగా జవహర్ నగర్ గడ్డ నిలుస్తుందని తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన కమిషనర్ త్వరలో ఇందిరమ్మ క్యాంటీన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కీసర మండల కార్యదర్శి నర్సింగ్ రావు, నాయకులు నగేష్, శివన్నారాయణ, కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




