వనపర్తి జిల్లాలో జిల్లా స్థాయి కమిటి ఏర్పాటు
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): మానసిక, బహుళ వైకల్యం, బుద్ధి మాంద్యం దివ్యాంగుల తలిదండ్రులు, సంరక్షకులకు సంరక్షకత్వం ధృవీకరణ పత్రం జారీ చేసేందుకు వనపర్తి జిల్లాలో జిల్లా స్థాయి కమిటి ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రకటించారు. సోమవారం ప్రజావాణి హాల్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన (5) మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రకటించారు.
జాతీయ ట్రస్టు చట్టం 1999 ప్రకారం మానసిక, బహుళ వైకల్యం, బుద్ధి మాంద్యం వంటి దివ్యాంగుల సంరక్షణ కొరకు అధికారికంగా సంరక్షకత్వం ధృవీకరణ పత్రాన్ని అధికారికంగా జారీ చేసేందుకు ఈ చట్టం అవకాశం కల్పించిందన్నారు. బుద్ధి మాంద్యం, బహుళ వైకల్యం ఉన్న దివ్యాంగులు కొందరు 18 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా వారు స్వయం నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదని అలాంటప్పుడు సదరు వ్యక్తికి సంబంధించిన బ్యాంకు అకౌంటు, లావాదేవీలు లేదా న్యాయాత్మక నిర్ణయాలు తీసుకోవడం లో వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల జోక్యం అవసరం ఉంటుందన్నారు.
కానీ దివ్యాంగుడికి 18 సంవత్సరాల వయస్సు దాటినందున వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నిర్ణయాలు లేదా అధికారాలు చట్ట ప్రకారం చెల్లవు. అందువల్ల అలాంటి తల్లిదండ్రులు, సంరక్షకులు జిల్లా కమిటీకి సంరక్షకత్వం ధృవీకరణ పత్రాన్ని పొందటానికి దరఖాస్తు చేసుకుంటే కమిటీ ద్వారా అన్ని పరిశీలించి సంరక్షకత్వం ధృవీకరణ పత్రం జారీ చేస్తుందని తెలిపారు. ఈ సంరక్షకత్వం ధృవీకరణ పత్రం పొందిన వారు మాత్రమే అధికారికంగా సంబంధిత దివ్యాంగుల నిర్ణయాధికారాలను పొందుతారని తెలియజేశారు.
ఇప్పటి వరకు వనపర్తి జిల్లాలో సంరక్షకత్వం ధృవీకరణ కొరకు (3) దరఖాస్తులు రావడం జరిగిందని, వాటిని కమిటీ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించి సంరక్షకత్వం ధృవీకరణ పత్రాన్ని జారీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ అధ్యక్షులు గాను, జిల్లా సంక్షేమ శాఖ అధికారి మెంబర్ కన్వీనర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, ఒక దివ్యాంగురాలు ఎ. లక్ష్మీ బాయి, ఇకో క్లబ్ బ్రహ్మ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండిక్యాప్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చంద్ర శేఖర గన్నోజి కమిటీ సభ్యులు గా ( 3) సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహిస్తారు.




