30 March, 2026 | 9:52 PM

ఆదివాసి మహిళపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలి

30-03-2026 08:15 PM

తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు కొడెం వెంకటేశ్వర్లు

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రంలో ఒక ఆదివాసి మహిళపై జరిగిన దాడి, ఆమె నివాస స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు కొడెం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పూనెం కమల పై దాడి చేయడానికి తుడుందెబ్బ తీవ్రంగా ఖండిస్తుందని ఆమెకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

బాధిత మహిళ పూనెం కమల తన భర్త ద్వారా పొందిన 4 గుంటల ఇంటి స్థలంలో నివసిస్తోందని ఆమె భర్త ప్రస్తుతం తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో‌ బాధపడుతున్నారని అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి, గతంలో ఈ స్థలాన్ని ఆమె భర్తకు విక్రయించిన వారే, ఇప్పుడు తమ బంధువర్గంతో కలిసి ఆ స్థలాన్ని తిరిగి కాజేయాలని వక్రమార్గాలు వెతుకుతున్నారని. ఒక ఆదివాసి మహిళ అని కూడా చూడకుండా, ఆమెపై దాడి చేసి  భూమిని లాక్కోవాలని కుట్ర పన్నుతున్నారన్నారు.

ఈనెల 26న సాయంత్రం, సయ్యద్ రఫీ, సాబీ హున్నీసా, ఎస్.డి. మహబూబ్ పాషా, పఠాన్ పాషా మరికొందరు వ్యక్తులు అక్రమంగా ఆమె స్థలంలోకి ప్రవేశించి. బాధితురాలిని అత్యంత అసభ్య పదజాలంతో కులం పేరు తీస్తూ దూషించి, పెద్ద రాడ్లతో భౌతిక దాడికి పాల్పడ్డారని. ఆమెను తన సొంత స్థలం నుండి బయటకు నెట్టివేసి, దౌర్జన్యంగా అక్కడ రేకుల షెడ్డు వేసి భూమిని ఆక్రమించుకున్నారని దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కఠినమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.