‘కార్పొరేట్’ వైద్యం అందించడమే లక్ష్యం
డిసీహెచ్‌ఎస్ అనురాగిణి రెడ్డి
ఇబ్రహీంపట్నం ఏరియా హాస్పిటల్, యాచారం సిహెచ్‌సీలలో తనిఖీలు
ఇబ్రహీంపట్నం, జులై 15 (విజయక్రాంతి): ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యాన్ని అందించాలన్న గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనురాగిణి రెడ్డి బుధవారం నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఏరియా ఆసుపత్రి, యాచారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లను సందర్శించి వైద్య సేవలను సమీక్షించారు.
రోగులతో ముఖాముఖి:
ఇబ్రహీంపట్నం ఏరియా ఆసుపత్రిలోని ఇన్-పేషెంట్ వార్డులు, ఫార్మసీ, ల్యాబ్లను పరిశీలించిన ఆమె రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యతపై ఆరా తీశారు. రికార్డులను తనిఖీ చేసి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలని ఆదేశించారు. యాచారం హాస్పిటల్ లో అత్యవసర సేవలు, ప్రసూతి వార్డులను పరిశీలించారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిధులతో నిర్మాణ దశలో ఉన్న యాచారం సిహెచ్సి పనులను స్వయంగా పరిశీలించారు. గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. తనిఖీ లో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






