బాధ్యతాయుతంగా పనిచేయాలి
- సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
- పోలీస్ సిబ్బందికి సీపీ రష్మీ సూచన
- దౌల్తాబాద్, రాయపోలు పోలీస్ స్టేషన్లలో తనిఖీ
సిద్దిపేట క్రైం: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, ప్రతి ఒక్కరూ అన్ని రకాల విధులపై అవగాహన కలిగి ఉండాలని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ సిబ్బందికి సూచించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, ప్రతిఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే పోలీస్ శాఖకు మంచి పేరు వస్తుందని అన్నారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని దౌల్తాబాద్, రాయపోలు పోలీస్ స్టేషన్లను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పోలీస్ స్టేషన్ల ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్ హెచ్ వో, లాక్ అప్ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు.
స్టేషన్లో రోజు వారీగా నిర్వహిస్తున్న రికార్డ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను, వాటి దర్యాప్తు పురోగతిని దౌల్తాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్, రాయపోలు ఎస్ఐ మానసను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ హిస్టరీ షీటర్ల వివరాలను పరిశీలిస్తూ, వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. సాయంత్రం సమయాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సూచించారు.
సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాలలో సీసీటీవీ కెమెరాలను అమర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో లేదా వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అంతకుముందు దౌల్తాబాద్ పోలీస్టేషన్ చేరుకున్న సీపీకి పోలీసు అధికారులు పూల మొక్కలందజేసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పోలీస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన బాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. రాయపోలు పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని సీపీ పరిశీలించారు. సీపీ వెంట గజ్వేల్ ఏసీపీ నర్సింలు, తొగుట సీఐ లతీఫ్, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సిబ్బంది ఉన్నారు.






