19 June, 2026 | 10:37 PM

విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

19-06-2026 09:40 PM

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి 

డీవైఎఫ్‌ఐ నాయకుల డిమాండ్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో విద్య హక్కు చట్టంను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య నాయకులు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి డి. సచ్చిదానంద చారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ మాట్లాడుతూ... జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.

విద్యా హక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత విద్య అందించాల్సి ఉన్నప్పటికీ, అనేక పాఠశాలలు ఆ నిబంధనలను అమలు చేయడం లేదన్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల వివరాలను బహిరంగంగా ప్రదర్శించకుండా అధిక మొత్తాలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. యూనిఫారాలు, షూలు, బెల్టులు, టైలు, పాఠ్యపుస్తకాలను పాఠశాలలే విక్రయిస్తూ విద్యను వ్యాపారంగా మార్చుతున్నారని విమర్శించారు. ప్రైవేట్ పాఠశాలల్లో సమగ్ర తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు.

స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి డి. సచ్చిదానంద చారి మాట్లాడుతూ... ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు విక్రయిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసేలా నోటీసులు జారీ చేసి, పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత విద్య అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.