19 June, 2026 | 11:00 PM

రాముడి పేరుతో ఓట్లు.. కార్పొరేట్ల కోసం పాలన

19-06-2026 09:19 PM

- కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డిసిసి అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి ఘాటు విమర్శలు

- గజ్వేల్‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

గజ్వేల్: శ్రీరాముడి పేరుతో ఓట్లు అడుగుతూ, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని గజ్వేల్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం, విద్యార్థులకు పూల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ, శ్రీరాముడిని కోట్లాది మంది భక్తితో ఆరాధిస్తారని, కానీ బీజేపీ మాత్రం ఆయన పేరును ఎన్నికల రాజకీయాలకు వినియోగిస్తోందని ఆరోపించారు.

ప్రజల విశ్వాసాలను ఓట్లుగా మార్చుకోవడమే బీజేపీ రాజకీయ ఎజెండాగా మారిందన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, యువత భవిష్యత్తు వంటి అంశాలను పక్కనపెట్టి భావోద్వేగ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కంటే కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని, దేశ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతోందని నర్సారెడ్డి ఆరోపించారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యల కోసం పోరాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ అని, దేశానికి ప్రేమ, ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించే నాయకత్వం అవసరమన్నారు.

ఆంక్షా రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రాహుల్ గాంధీ ఆశయాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేయడంతో పాటు "నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కా దుకాన్" కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పూలు పంపిణీ చేశారు.