ప్రమాద బీమాతో కుటుంబాలకు ఆర్థిక భరోసా
పుల్లూరులో అవగాహన సదస్సు మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల బీమా చెక్కు అందజేత
సిద్దిపేట రూరల్: ప్రజలు ప్రమాద బీమా పథకాలను సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ ఈ. రాజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని పుల్లూరు గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బ్యాంకు ద్వారా అమలు చేస్తున్న ప్రమాద బీమా పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా పుల్లూరు గ్రామానికి చెందిన గడ్డం అంజిరెడ్డి ఎస్బీఐ జనరల్ ప్రమాద బీమా పథకంలో సభ్యత్వం పొందగా, ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల బీమా క్లెయిమ్ చెక్కును అందజేశారు. సీనియర్ మేనేజర్ ఎం. రమేష్ యాదవ్ మాట్లాడుతూ బ్యాంకు అందిస్తున్న బీమా పథకాలు, ముద్ర రుణాలు, రైతులకు అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలపై అవగాహన కల్పించారు. ప్రజలు ఈ అవకాశాలను వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.






