23-02-2026 02:26:06 AM
సముద్రం ముందు నిలబడి
నా మనసు వలను దాని పైకి విసిరా
నా కావ్య కన్యకు కావలసిన
శిలాక్షరాలను నింపుకొని రమ్మన్నా
కాలంలో వలను విప్పి చూస్తే
మత్స్యకారుల చెమట చుక్కల వాసనలు
నింపుకొని నురుగు విరుల అక్షరాలు
పూటకు తలె లో ఇంత అన్నం మెతుకులు
అందించలేని శోకసప్తమైన అక్షరాలు
కోపం ఎత్తుకున్న సముద్రపు సుడిగుండంలో
గుండెలు అర్పించిన మత్స్యకారుల
జీవన విలవిల అక్షరాలు
సొరల ఆకలి దాహనికి బలియైన
కష్టజీవుల రక్తపు రాతలైన అక్షరాలు
ఇంటి వెలుగు కోసం సముద్రుడి కాళ్లు పట్టుకొని
ఇంత బువ్వ పెట్టమని వేడిన వేదనల వెతల అక్షరాలు
సముద్రము పంటపై ఎంత సాగుచేసినా
నిండని పొట్టల పోరు అక్షరాలు
సముద్రం కోపము చూస్తూ పడవను
ఆకలి మెడకేసుకొని ఒడ్డున కూర్చున్న అక్షరాలు
సముద్రుడి కోపానికి అదుపుతప్పి
కుటుంబ బాధ్యతతో కన్నీరై ప్రాణాలర్పించిన అక్షరాలు
నీవే దిక్కని సముద్రుడికి పూజలు అర్పించిన
ఆకలికేకల అక్షరాలు
సముద్రము పై శిలాక్షరాలు
ఇంకెన్నో దొరికినవి నా కావ్య కన్యకకు
అది చూసి ఒక్కొక్క అల పిడికెడు
నిండా అక్షరాలను తెచ్చి నా పాదాలకు స్పృశిస్తున్నవి !