డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం
- ప్రో రేటా ప్రకారం సీట్ల పెంపునకు పోరాడాలి
- ఈ లెక్క కేంద్ర మంత్రులుగా ఉన్న వారికి తెలియడం లేదా?
- ప్రజా పాలనకు పట్టం కడుతుంటే ఓర్వలేకనే కుట్రలు
- అంబేద్కర్ జయంతి వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): నియోజకవర్గాల పునర్విభజన విషయంలో బీజేపీ కుట్రలు చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర చేస్తున్నారని, 50 శాతం ప్రాతిపదికన పెంచుతామని దక్షిణాది రాష్ట్రాల సీట్ల కోటా తగ్గించాలని చూస్తున్నారన్నారు. దక్షిణాదిలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని ఈ చిన్న లెక్క కేంద్ర మంత్రులుగా ఉన్నవాళ్లకి తెలియడం లేదా? అని ప్రశ్నించారు.
మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించి అనంతరం మాట్లాడారు. రాజ్యాధికారం అంతిమ లక్ష్యం అని అంబేద్కర్ చెప్పారని, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రో రేటా ప్రకారం సీట్ల పెంపు కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంచి పనికి మా ప్రభుత్వం ముందుంటుందని ఈ ప్రభుత్వం మీది.. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీదన్నారు.
దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజలే ఈ దేశం భవిష్యత్, సంపద అని ప్రజా ప్రభు త్వం గుర్తించి వారిని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ ప్రయత్నాల వల్లే గత పదేళ్ల పాలన, ఈ రెండేళ్ల మా పాలన చూసి ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మాకు పట్టం కడుతుంటే చూసి ఓర్వలేక కుట్రలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తాము ఇందిరమ్మ ఇండ్లలో మెజారిటీ వాటా దళితులు, గిరిజనులకు ఉందనేది నిజం కాదా? తాము వచ్చాక 67 వేలకు పైగా ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల్లో 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాయన్నారు.
దళితుడిని మైక్ అడగాల్సి వస్తుందనే అసెంబ్లీకి రానిది
రక్తం చిందకుండా యుద్ధాన్ని గెలవచ్చని మహాత్మాగాంధీ నిరూపిస్తే, ఆ గొప్ప దేశాన్ని అద్భుతంగా పరిపాలించి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుపొచ్చవచ్చని నిరూపించింది అంబేద్కర్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి వైపు నడపవచ్చని చెప్పిన మార్గదర్శి, ప్రపంచ మేధావి అంబేద్కర్ అన్నారు.
ఈ దేశానికి రెండు కళ్లలో ఒకటి మహాత్మగాంధీ అయితే మరో కన్ను అంబేద్కర్ అని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానమే ప్రజా పాలన విధానం అని, తెలంగాణ రావడానికి ప్రధాన కారణం అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టిన ఆర్టికల్ 3 అని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో బడుగు బలహీన వర్గాల పిల్లలే ముందుండి ప్రత్యేక పాత్ర పోషించారని, అంబేద్కర్‌తో పాటు ప్రస్తుతం గద్దర్‌ను గుర్తు చేసుకోవాలన్నారు. అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతం ఈ నినాదం రణనినాదమై తెలంగాణ పల్లెల్లో మార్మోగి రాష్ట్రాన్ని సాధించుకునేలా చేసిందని ఈ గీతమే ఇప్పుడు రాష్ట్ర గీతంగా అవతరించిందన్నారు.
తెలంగాణ వచ్చిన మొదటి పదేళ్లలో ఉద్యమంలో ముందున్న వారి పరిస్థితి ఎలా ఉం ది?, గద్దర్, అందెశ్రీ లాంటి వారి పరిస్థితి ఎలా ఉందని ఆలోచించాలన్నారు. తమ ప్రభుత్వంలో స్పీకర్‌తోపాటు నలుగురు మంత్రులు, విప్‌లలో దళితులు, గిరిజనులకు ఇంతటి ప్రాతినిథ్యం ఉమ్మడి రాష్ట్రంలోనైనా దక్కలేదన్నారు. ఒక దళిత బిడ్డను అధ్యక్షా అని పిల వాల్సి వస్తుందని కొంత మంది అసెంబ్లీకే రావడం లేదంటే, దళితుల పట్ల గౌరవం ఏపాటిదో ఓ సారి ఆలోచన చేయాలని చెప్పారు.






