18 April, 2026 | 9:00 PM

మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో బీసీలకు అన్యాయం

18-04-2026 07:15 PM

హుస్నాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లు, డి లిమిటేషన్ పేరుతో బీసీలను అణచివేసే కుట్ర జరుగుతోందని బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ పేరుతో బిల్లు తీసుకువచ్చినా, దేశంలో 80 కోట్ల మంది బీసీలకు తగిన ఉపకోటా కల్పించలేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు 16.5 శాతం ఉపకోటా ఇవ్వాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయని తెలిపారు.

డి లిమిటేషన్ పేరుతో లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచి దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గించే కుట్ర జరుగుతోందన్నారు. జనగణన, కుల గణన తర్వాతే డి లిమిటేషన్ చేపట్టాలని విపక్షాలు కోరినా కేంద్రం మొండి వైఖరిలో ముందుకెళ్లిందని విమర్శించారు. ఓసీలకు లాభం చేకూర్చేలా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్యాయం జరిగేలా ఈ బిల్లులు ఉన్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి విధానాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని బీఎస్పీ పార్టీ తరఫున కోరారు.