5 April, 2026 | 4:23 AM

బీసీలను లెక్కించకుండా అన్యాయం

05-04-2026 12:36 AM
  1. కేంద్ర కుల గణన అనేది బోగస్
  2. రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ నేతలు
  3. సోమాజిగూడలో వీహెచ్ ఆధ్వర్యంలో సమావేశం

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అధ్యక్షతన రాజకీయపార్టీలు,- కుల సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ నేతలు మాట్లాడుతూ.. కేంద్రం నిర్వహించే జనగణనలో ఇల్లు కూలిపోతుందా లేదా, స్లాబ్ కి ఏమి వాడారు ఇవన్నీ సెన్సెస్‌లో ఉన్నాయని కానీ బీసీ కుటుంబాలను లెక్కించాలని ఎందుకు లేదని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు మాత్రమే లెక్కిస్తుంది, మిగతా వారిని ఇతరులుగా చూపిస్తున్నారు. ఇది ఓబీసీ లను అన్యాయానికి గురిచేయడమే అవుతుందన్నారు. కర్ణాటక, పంజాబ్, బీహార్ రాష్ట్రాల లో ఆ ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లు చేసి నా, దానికి చట్టబద్ధత లేదన్నారు. భారతదేశంలో మేమే బీసీ జనగణన చేసి, బీసీలను ఆదుకుంటామన్న ప్రధానమంత్రి ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్రాల బీసీల ఓటర్లను మభ్యపెట్టడానికి మాత్రమే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. 

ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయో గించుకుంటున్నాయి, కానీ వారి రాజకీయ పురోగతికి సహకరించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సెన్సెస్‌లో ఎస్సీ, ఎస్టీ లతో పాటు బీసీలను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యా ప్తంగా ఉద్యమం చేపట్టేలా పిలుపునిస్తానమన్నారు. జనాల వివరాలు సేకరించే లిస్ట్‌లో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీల వివరాలు కూడా సేకరించాలని డిమాండ్ చేశారు.

కేంద్రం లో ఓబీసీ లకు మంత్రిత్వ ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బిసి మేధావుల  ఫోరం కన్వీనర్ చిరంజీవులు, బిసి జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, బిసి పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షులు బాలరాజు గౌడ్, గుజ్జ కృష్ణ, కోల జనార్ధన్, ఐలి వెంకన్న గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు.