16 August, 2026 | 10:24 AM

నిరుద్యోగ యువతకు ‘ఉద్యోగ మిత్ర’ అండ

16-08-2026 09:22 AM

ఉచితంగా పోటీ పరీక్షల శిక్షణ, స్టడీ మెటీరియల్

సునీతమ్మ ఉద్యోగ మిత్ర’ యాప్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

నర్సాపూర్ : లక్ష్మారెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయికృష్ణ ఫంక్షన్ హాల్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్వయంగా రక్తదానం చేయగా, ఆమె అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘సునీతమ్మ ఉద్యోగ మిత్ర’ యాప్‌ను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. నియోజకవర్గంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం ఉచితంగా నాణ్యమైన శిక్షణ, స్టడీ మెటీరియల్ అందించాలనే ఉద్దేశంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు ఆమె తెలిపారు.

ఇంటివద్ద నుంచే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం యాప్‌లో తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో వీడియో తరగతులు, స్టడీ మెటీరియల్, మాక్‌ టెస్టులు, అసైన్‌మెంట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గ్రూప్‌-1, 2, 3, 4తో పాటు పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్‌ఐ తదితర పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణా సామగ్రి ఉచితంగా పొందవచ్చన్నారు. హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లి కోచింగ్‌ తీసుకోవడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగుల కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఇంటివద్ద నుంచే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ఈ ఉచిత వేదికను అందుబాటులోకి తీసుకొచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. యువత, విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.