16 August, 2026 | 10:26 AM

వేట కోసం విద్యుత్‌ ఉచ్చు.. ఎఫ్‌బీవో మృతికి కారణమైన నలుగురు అరెస్ట్

16-08-2026 09:37 AM

బూర్గంపాడు,(విజయక్రాంతి): అడవి జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి చెరువుసింగారం వెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ బానోత్‌ నవీన్‌ మృతిచెందిన ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పాల్వంచ సీఐ సతీష్‌ తెలిపారు. శనివారం వివరాలు వెల్లడించారు.ఈ నెల 11న రాత్రి నకిరిపేట అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేటకు విద్యుత్‌ తీగలు అమర్చినట్లు సమాచారం అందడంతో ఎఫ్‌బీవో నవీన్‌, డీఆర్వో అనార్కలీ, ఇతర సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. వేటగాళ్ల కోసం గాలిస్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి నవీన్‌ అక్కడికక్కడే మృతిచెందారు.

డీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనకు కారణమైన లక్ష్మీపురానికి చెందిన ఆవుల నాగిరెడ్డి, దాసరి నరేష్‌, తాటి వీరబాబు, నాగినేనిప్రోలు రెడ్డిపాలెంకు చెందిన కన్నెదారి అనంతయ్యను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి బైండింగ్‌ వైరు, వైర్లు పాతేందుకు ఉపయోగించిన కర్రలు, గడ్డపలుగు, ఖాళీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.వన్యప్రాణుల వేట కోసం అక్రమంగా విద్యుత్‌ తీగలు అమర్చి జంతువులు, మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌ఐలు మేడా ప్రసాద్‌, నాగభిక్షం పాల్గొన్నారు.