జెమీమా హాఫ్ సెంచరీ, భారత్ 198
ఆస్ట్రేలియాతో ఏకైక టెస్ట్
ఆసీస్ స్కోరు 96/3
పెర్త్, మార్చి 6: ఆస్ట్రేలియా పర్యటనలో ఏకైక టెస్టు ఆడుతున్న భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్ లో 198 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో భారత జట్టు తరపున నలుగురు ప్లేయర్లు టెస్ట్ అరంగేట్రం చేశారు. యువ క్రికెటర్లు ప్రతీకా రావల్, క్రాంతి గౌడ్, కాశ్వీ గౌతమ్, సయాలి సత్ఘారే టెస్ట్ క్యాప్ లు అందుకున్నారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ కు సరైన ఆరంభం దక్కలేదు.
స్మృతి మంధాన 4 పరుగులకే ఔటవగా.. అరంగేట్రం చేసిన ప్రతీకా రావల్ 18 రన్స్‌కు ఔటైంది. అయితే షెఫాలీ వర్మ(35) , జెమీమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీతో రాణించారు. జెమీమా రోడ్రిగ్స్ 52 (7 ఫోర్లు) పరుగులకు ఔటైన తర్వాత కశ్వి గౌతమ్ ఆదుకుంది. నిలకడగా ఆడి 34 పరుగులు చేసింది. దీంతో భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది.
తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ మహిళల జట్టుకు ఆదిలోనే సయాలీ సద్ఘరే షాకిచ్చింది. ఓపెనర్ జార్జియా వోల్ (2), కెప్టెన్ అలీ హీలీ(13)లను పెవిలియన్ కు పంపింది. తర్వాత లిచ్ ఫీల్డ్‌ను క్రాంతి గౌడ్ ఔట్ చేయడంతో ఆసీస్ 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఎలీసా పెర్రీ, అన్నాబెల్ సదర్లాండ్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 38 పరుగులు జోడించారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్లకు 96 రన్స్ చేసింది.




