6 May, 2026 | 7:32 PM

అధికారులు, అన్ని వర్గాల ప్రజలను రెడ్ క్రాస్ లో భాగస్వాములను చేయాలి

06-05-2026 06:35 PM

రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

రెడ్ క్రాస్ సభ్యుల సమావేశంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల టౌన్: జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి, అన్ని వర్గాల ప్రజలు విస్తృతంగా పాల్గొనేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో  కలెక్టర్ రెడ్ క్రాస్ జిల్లా సంఘం చైర్మన్, పలువురు సభ్యులతో సమావేశమై మాట్లాడారు.

జిల్లాలో ఇప్పటికే సుమారు 1200 మంది రెడ్ క్రాస్ సభ్యులు ఉండగా, మరికొంత మంది నమోదు ప్రక్రియలో ఉన్నారని తెలిపారు. ఈ సంఖ్యను గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, యువత ముందుకు రావాలన్నారు. జీవితకాల సభ్యత్వం రూ.1000 మాత్రమే ఉండటం వల్ల ప్రజలు సులభంగా సభ్యత్వం పొందవచ్చని తెలిపారు. కలెక్టరేట్‌లో ప్రజాపాలన విభాగంలోనే ప్రత్యేక రెడ్ క్రాస్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అక్కడే నేరుగా రిజిస్ట్రేషన్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

విధులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి నమోదు ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. రెడ్ క్రాస్ కార్యకలాపాలను గ్రామ స్థాయి వరకు విస్తరించేందుకు మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యాసంస్థల్లో జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ కార్యక్రమాలను చేపట్టి విద్యార్థులను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని తెలిపారు. ప్రభావవంతమైన వ్యక్తులు, సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు.

సభ్యత్వ నమోదు, విరాళాల సేకరణ పూర్తిగా పారదర్శకంగా జరగాలని, నగదు స్వీకరణ జరిగితే వెంటనే రెడ్ క్రాస్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. వార్షిక ఆడిట్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, ఆర్థిక వ్యవహారాల్లో ఎటువంటి లోపాలు ఉండకూడదని పేర్కొన్నారు. రెడ్ క్రాస్ ద్వారా రక్తదాన, వైద్య శిబిరాలు, విపత్తు నిర్వహణ కార్యక్రమాలు మరింత విస్తరించాలని, అవసరమైతే బ్లడ్ బ్యాంక్, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తమ బాధ్యతగా తీసుకుని ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. చిన్న చిన్న సంస్థలు, సంఘాలు కూడా సభ్యత్వంలో భాగస్వాములు కావాలన్నారు. రెడ్ క్రాస్ సంస్థ యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో మానవతా సేవలు అందించే ప్రముఖ సంస్థగా నిలిచిందని, ఈ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, రెడ్ క్రాస్ సొసైటీ నోడల్ అధికారి వేణుగోపాల్, మంజుల, అజారుద్దీన్, సంఘం జిల్లా చైర్మన్ అయ్యపు రెడ్డి, రాష్ట్ర ఈసీ మెంబర్ రమేష్, జిల్లా సభ్యులు మహేష్ నాయుడు,  సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.