25 August, 2026 | 12:24 AM

8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం

24-08-2026 10:22 PM

ప్రపంచ వేదికపై స్వర్ణoతో సత్తా చాటిన గమన్ రెడ్డి

నేరేడుచర్ల,(విజయ క్రాంతి): ప్రపంచ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ నేరేడుచర్లకు చెందిన బాల తైక్వాండో క్రీడాకారుడు కొణతం గమన్ రెడ్డి సత్తా చాటాడు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 1వ వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు. అమికల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అంతర్జాతీయ పోటీల్లో వివిధ దేశాల జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొనగా,తుదిదశలో భారత్, శ్రీలంక, నేపాల్ దేశాల క్రీడాకారుల మధ్య హోరాహోరీ పోటీ సాగగా గమన్ రెడ్డి ప్రత్యర్థులను వెనక్కి నెట్టి స్వర్ణ పతకాన్ని కైవసం  చేసుకున్నాడు. పోటీ అనంతరం తైక్వాండో డాన్-9 గ్రాండ్ మాస్టర్ శ్రీ జయంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు.

నాలుగేళ్లుగా నిరంతర సాధన

ప్రస్తుతం అల్కాపూర్ టౌన్‌షిప్‌లోని మార్నింగ్ రాగా కమ్యూనిటీలో నివాసం ఉంటున్న గమన్ రెడ్డి స్కాలర్స్ అకాడమీలో 6వ తరగతి చదువుతున్నాడు. టౌన్‌షిప్‌లోని కోచ్ సైకం సుబ్బారావు ఆధ్వర్యంలోని సిట్స్ సంస్థలో గత నాలుగేళ్లుగా తైక్వాండోలో శిక్షణ పొందుతున్నాడు. ఈ తాజా విజయంతో గమన్ రెడ్డి సాధించిన పతకాల సంఖ్య 12కు చేరింది. ఇందులో 8 స్వర్ణ పతకాలు, 4 రజత పతకాలు ఉన్నాయి. వరుస విజయాలతో తైక్వాండోలో తన ప్రతిభను చాటుకుంటున్న గమన్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి మరిన్ని పతకాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.

గమన్ రెడ్డి స్వర్ణ విజయం పట్ల ఆయన నాయనమ్మ, తాతయ్య, నేరేడుచర్ల మున్సిపాలిటీ మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణ రెడ్డి–విజయలక్ష్మి, అమ్మమ్మ నారీమణి (విశాఖపట్నం), కుటుంబ సభ్యులు, నేరేడుచర్ల ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. గమన్ రెడ్డిని అభినందిస్తూ అతని విజయానికి కృషి చేస్తున్న కోచ్ సైకం సుబ్బారావు, కోచింగ్ సిబ్బంది, కుటుంబ సభ్యులు, ప్రోత్సాహం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించి స్వర్ణ పతకం సాధించడం గమన్ రెడ్డి కుటుంబానికే కాకుండా నేరేడుచర్ల ప్రాంతానికంతటికీ గర్వకారణమని, పలువురు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, నేరేడుచర్లకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.