27 February, 2026 | 1:52 AM

చెపాక్‌లో చెడుగుడు

27-02-2026 12:00 AM

జింబాబ్వేను చిత్తు చేసిన భారత్

అభిషేక్, హార్థిక్ విధ్వంసం

సెమీస్‌కు ఇక అడుగే దూరం

ఒక్క ఓటమితో సెమీఫైనల్ రేసులో వెనుకబడి విమర్శలు ఎదుర్కొన్న భారత క్రికెట్ జట్టు జింబాబ్వేపై మాత్రం ఆల్‌రౌండ్‌శో అదరగొట్టింది. బ్యాటింగ్‌లో అభిషేక్ , హార్థిక్ మెరుపులు.. బౌలింగ్‌లో స్పిన్నర్లు కలిసికట్టుగా రాణించిన వేళ అంచనాలకు తగ్గట్టే జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. అంతకుముందే విండీస్‌పై సౌతాఫ్రికా గెలుపుతో భారత్‌కు రిలీఫ్ దక్కింది. ఇక రన్‌రేట్‌తో సంబంధం లేకుండా విండీస్‌పై చివరి మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌కు చేరుతుంది.

చెన్నై , ఫిబ్రవరి 26 : సూపర్ 8 స్టేజ్‌ను ఓటమితో ఆరంభించి సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న టీమిండియా ఎట్టకేలకు పుంజుకుంది. జింబాబ్వేపై చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంపర విక్టరీ కొట్టింది. ఈ క్రమంలో రికార్డుల మోత మోగించింది. బ్యాటర్లందరూ తలో చేయి వేసిన వేళ భారత జట్టు టీ ట్వంటీ ప్రపంచకప్‌లోనే రికార్డు స్కోరు సాధించింది. ఫామ్‌లో లేని బ్యాటర్లందరూ ఈ మ్యాచ్‌లో అదరగొట్టేశారు. తుది జట్టులో చోటు దక్కించుకున్న సంజూ శాంసన్ 24 పరుగులకే ఔటైనా...అభిషేక్ శర్మ, హార్థిక్ పాండ్యా మెరుపు హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు.

వరుస వైఫల్యాలతో మొన్నటి వరకూ తీవ్ర ఒత్తిడిలో కనిపించిన అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడినా క్రీజులో కుదురుకున్న తర్వాత ఈ యువ ఓపెనర్ విధ్వంసం సృష్టించాడు. తన సహజశైలి బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. కేవలం 30 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు.అలాగే వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 38 రన్స్ చేయగా.. 13 బంతుల్లోనే 33 (3 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశాడు.

చివర్లో క్రీజులోకి వచ్చిన హార్థిక్ పాండ్యా దెబ్బకు జింబాబ్వే బౌలర్లు బెంబేెలెత్తిపోయారు. వచ్చీ రావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడ్డ పాండ్యా కేవలం 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదేశాడు. అతనికి తోడగా తిలక్ వర్మ సైతం చెలరేగిపోయాడు. గత మ్యాచ్‌లలో మంచి ఆరంభాలు లభించినా పెద్ద స్కోరు చేయలేకపోయిన తిలక్ వర్మ 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. సంజూ తొలి వికెట్‌కు 48, ఇషాన్ కిషన్ రెండో వికెట్‌కు 72 . సూర్యకుమార్ 30, సూర్యకుమార్ 22, తిలక్ వర్మ శర్మ 84 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పారు. 

ఫలితంగా భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగులు చేసింది. ఈ టీ ట్వంటీ ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక స్కోరు. అలాగే టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ కు ఇదే హయ్యెస్ట్ స్కోరు. అలాగే ఈ మ్యాచ్ లో భారత్ 17 సిక్సర్లు కొట్టింది. తద్వారా 2024లో ఆసీస్ పై కొట్టిన 15 సిక్సర్ల రికార్డును బ్రేక్ చేసింది. ఇదిలా ఉంటే హార్థిక్ , తిలక్ వర్మ 31 బంతుల్లోనే 84 పరుగుల పార్టనర్ షిప్ కూడా రికార్డే. మొత్తం మీద భారత బ్యాటర్ల దెబ్బకు జింబాబ్వే బౌలర్లు ఒక్కొక్కరూ 10కి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు.

ఛేజింగ్‌లో జింబాబ్వే ఓ మాదిరిగా పోటీనిచ్చింది. వికెట్లు కోల్పోయినా దూకుడు ఆడింది. ఓపెనర్ బెన్నెట్ మెరుపులు మెరిపించాడు. సికిందర్ రజాతో కలిసి అభిమానులను అలరించాడు. బెన్నెట్ దెబ్బకు శివమ్ దూబే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. బెన్నెట్, సికిందర్ రజా 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మధ్యలో స్పిన్నర్లు పుంజుకోవడంతో జింబాబ్వే వరుసగా వికెట్లు కోల్పోయింది.

కీలక సమయంలో అర్షదీప్‌సింగ్ వికెట్లు తీయగా.. మిగిలిన బౌలర్లు కూడా ఒక్కో వికెట్ పడగొట్టారు. చివరికి జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసింది. బెన్నెట్ 48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్ 72 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే రన్ రేట్‌తో సంబంధం లేకుండా భారత్ తర్వాతి మ్యాచ్‌లో విండీస్‌పై గెలిస్తే సెమీస్ చేరుతుంది.

స్కోరు బోర్డు

భారత్ ఇన్నింగ్స్ : 256/4 (అభిషేక్ శర్మ 55, హార్థిక్ పాండ్యా 50 నాటౌట్, తిలక్ వర్మ 44 నాటౌట్, నగరవా 1/62, ముజర్బానీ 1/43, మపాసా 1/40)

జింబాబ్వే ఇన్నింగ్స్ : 184/6 ( బెన్నెట్ 97 నాటౌట్, సికిందర్ రజా 31, మరుమని 20; అర్షదీప్ సింగ్ 3/24, వరుణ్ చక్రవర్తి 1/35, అక్షర్ పటేల్ 1/35)