ఆసీస్ మహిళలదే వన్డే సిరీస్
జార్జియా వోల్ సెంచరీ
రెండో వన్డేలో భారత్ ఓటమి
హోబార్ట్, ఫిబ్రవరి 27: ఆసీస్ గడ్డపై టీ20 సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టుకు వన్డే సిరీస్ లో మాత్రం చుక్కెదురైంది. వరుసగా రెండో వన్డేలోనూ భారత్ పరాజయం పాలైంది. బ్యాటర్లు రాణించినా బౌలర్లు మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. ఫలితంగా ఆస్ట్రేలియా మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను సొంతం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు ప్రతీకారావల్, స్మృతి మంధాన మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 78 పరుగులు జోడించారు. మంధాన (37 బంతుల్లో31) ఔటవగా.. జెమీమా రోడ్రిగ్స్ (11) విఫలమైంది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ప్రతీకా రావల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ప్రతీకా రావల్ 52 (6 ఫోర్లు) పరుగులకు ఔటవగా.. దీప్తి శర్మ(1), అమన్ జోత్ కౌర్(13) నిరాశపరిచారు. చివర్లో రిఛా ఘోష్ 22 , కష్వి గౌతమ్ 25 , క్రాంతి గౌడ్ 19 పరుగులతో పర్వాలేదనిపించారు.




