కలెక్టరేట్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
దేశ ప్రగతికి పునరంకితమవుదాం
ప్రతి పౌరుడు తన బాధ్యతను నెరవేర్చాలి
2047 విజన్ సాకారానికి యువత చురుకుగా భాగస్వాములు కావాలి
అడిషనల్ కలెక్టర్ సంగీత
సంగారెడ్డి, ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సముదాయంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సముదాయ ఆవరణలో జిల్లా అదనపు కలెక్టర్ సంగీత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంగీత మాట్లాడుతూ, ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నామని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తించి, దేశ అభివృద్ధిలో భాగస్వామి కావాలని సూచించారు. ముఖ్యంగా యువత నూతన ఆలోచనలు, నైపుణ్యాలతో ముందుకు సాగుతూ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం లక్ష్యంగా నిర్దేశించిన విజన్‌కు అనుగుణంగా అడుగులు వేయాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో అధికారులు, ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని ఆమె సూచించారు. ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






