24 June, 2026 | 3:22 AM

కొనుగోలు లక్ష్యం పెంచండి

24-06-2026 01:30 AM
  1. తెలంగాణలో భారీగా ధాన్యం దిగుబడులు 
  2. తక్కువ సేకరణతో రాష్ట్రంపై ఆర్థికభారం 
  3. సీఎంఆర్ గడువునూ పొడిగించాలి 
  4. మంత్రులు ఉత్తమ్, తుమ్మల వినతి
  5. ఢిల్లీలో కేంద్రమంత్రి జోషితో భేటీ

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి) : తెలంగాణలో రికార్డు స్థాయిలో పండిన వడ్లను కొనడానికి వీలుగా ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్రం కొనుగోలు చేస్తున్న ధాన్యం.. తక్కువగా నిర్ధారి స్తుండటంతో రాష్ట్రంపై భారం పడుతుందని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పెంచాలన్నారు. అలాగే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.

మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషిని.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లా డారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలు ప్రభుత్వ లక్ష్యమన్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు ఒక్క గింజ కూడా నష్టపోకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు.

రబీకి సంబంధించి ఇప్పటివరకు 80.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఇది దేశంలోనే రికార్డ్ అని, కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఖరీఫ్, రబీ కలిపి 2025- 26 మార్కెటింగ్ సీజన్‌లో తెలంగాణలో 152 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరించి రికార్డు నమోదు చేశామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.  

రాష్ట్రంపై రూ.16,446 కోట్ల భారం

రాష్ట్రం అంచనాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ లక్ష్యాలను తక్కువగా నిర్ధారించడం వల్ల రాష్ట్రంపై  ఆర్థిక భారం పడుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రబీలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అంచనాలు సమర్పించగా, కేంద్రం కేవలం 35 లక్షల టన్నుల వడ్లు మాత్రమే లక్ష్యంగా నిర్ణయించిందని  తెలిపారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం లక్ష్యాలను మించి కొనుగోళ్లు చేపట్టినట్లు చెప్పారు.

గత మూడు సీజన్లలోనూ కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలకు మించి 69.50 లక్షల టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేయాల్సి వచ్చిందని, దీనివల్ల రాష్ట్ర ఖజానాపై రూ.16,446 కోట్ల అదనపు ఎంఎస్పీ భారం పడిందని వెల్లడించారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెనుకడుగు వేయలేదన్నారు. ప్రతి గింజనూ కొనుగోలు చేసి వారి ఆదాయాన్ని కాపాడటంలో ప్రభుత్వం విజయం సాధించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 

కేంద్రమంత్రి దృష్టికి సీఎంఆర్ ఇబ్బందులు

2024-- 25 రబీకి సంబంధించి ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 2025- -26 వానాకాలం 14.24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్రానికి సరఫరా చేయాల్సి ఉందని, ఈ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు ఉత్తమ్ తెలిపారు. అధిక దిగుబడి, స్థలం కొరత, ఒకేసారి కొనుగోళ్లు, మిల్లింగ్ సామర్థ్యం తక్కువ వంటి కారణాల వల్ల సీఎంఆర్ గడువు పొడిగించాలని కోరారు.  2024-- 25 రబీ సీఎంఆర్ సరఫరా గడువును 60 రోజులు, 2025- -26 ఖరీఫ్ గడువును 120 రోజులు పొడిగించాలని విన్నవించారు. 

అలాగే  2025-- 26 రబీ సేకరణ లక్ష్యాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 54.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి పెంచాలని పేర్కొన్నారు. అంతేకాకుండా రబీలో పండించిన ధాన్యం ఎక్కువగా ఉప్పుడు బియ్యం తయారీకి అనుకూలంగా ఉంటుందని, బాయిల్డ్ రైస్ రూపంలో సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని ఉత్తమ్ కోరారు.