100 కోట్ల అవినీతి
- నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అక్రమార్జన
- పది చోట్ల ఏకకాలంలో ఏసీబీ దాడులు
- 10.23 ఎకరాల వ్యవసాయ భూమి, 4 ఇళ్లు, ఒక వాణిజ్య భవనం, 8 ప్లాట్లు ఉన్నట్టు గుర్తింపు
- మల్లారెడ్డి వద్ద రూ.3.31లక్షల నగదు, బ్యాంకులో రూ.50 లక్షలు
- మల్లారెడ్డి భార్య, కుటుంబ సభ్యుల పేరున 3 బ్యాంకు లాకర్లు
- ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.3 కోట్లు..
- బహిరంగ మార్కెట్‌లో వంద కోట్లకు పైగా ఆస్తులు
- మల్లారెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు
కామారెడ్డి/మద్దూరు, జూన్ 23 (విజయక్రాంతి): ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిం టెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిని మంగళవారం ఏసీబీ అధికారు లు అరెస్టు చేశారు. ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసులో భాగంగా ఏసీబీ అధికారులు మంగళవారం హైదరాబాద్‌లోని మచ్చబొల్లారం, నిజామాబాద్‌లోని ప్రగతినగర్‌లోని మల్లారెడ్డి నివాసం, కార్యాలయంతో పాటు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని ఆయన స్వగ్రామం నర్సాయపల్లిలోని నివాసంతోపాటు బంధువుల ఇళ్లలో మొత్తం 10 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
తనిఖీల్లో మల్లారెడ్డి పేరున 10.23 ఎకరాల భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, 5 భవనాలు ఉన్నట్లు గుర్తించారు. అందులో నాలుగు నివాసపు గృహాలు, ఒకటి వాణిజ్య భవనం ఉన్నాయి. అలాగే ఎనిమిది ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు. మల్లారెడ్డి వద్ద రూ.3.31లక్షల నగదు లభ్యం కాగా, బ్యాంకులో రూ.50 లక్షల నగదు ఉన్నట్టు తేల్చారు. మల్లారెడ్డి భార్య, కుటుంబ సభ్యుల పేరున 3 బ్యాంకు లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. విచారణలో భాగంగా వీటిని త్వరలో అధికారులు తెరవనున్నారు.
సోదాల్లో అధికారులు గుర్తించిన మొత్తం ఆస్తు ల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.3 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మార్కెట్ విలువ ప్రకారం వంద కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా కొమ్మూరి మల్లారెడ్డి సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రానికి చెందిన కంటారెడ్డి రామిరెడ్డి కుమార్తె మాధవిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం వారు అమెరికాలో స్థిరపడ్డారు. జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డికి మల్లారెడ్డి సోదరుడు.






