25 August, 2026 | 11:34 PM

ప్రజల ఆరోగ్యమే మా ప్రభుత్వానికి ప్రాధాన్యం : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

25-08-2026 10:14 PM

నాచారం: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కట్టుబడి పనిచేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. హెచ్ఎంటీ నగర్ డివిజన్‌లోని అన్నపూర్ణ కాలనీ, సరస్వతి నగర్ కాలనీల పార్కుల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్య సంరక్షణ అత్యంత ముఖ్యమైందని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రజలు వ్యాయామం చేయడానికి అనువైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో కాలనీల్లో ఓపెన్ జిమ్‌లు, పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు వంటి సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

యువతతో పాటు మహిళలు, వృద్ధులు కూడా ప్రతిరోజూ వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండేందుకు ఈ ఓపెన్ జిమ్‌లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, హెచ్ఎంటీ నగర్, నాచారం డివిజన్లలో మౌలిక వసతుల కల్పన, రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధి, తాగునీటి సదుపాయాల మెరుగుదల వంటి పనులను వేగవంతంగా చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రతి అభివృద్ధి పనికి నిధులు మంజూరు చేయిస్తూ, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.