ఐలమ్మ కళా భారతిని ప్రారంభించండి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
రూ 7 కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తే వృధాగా ఉంచుతారా?
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ : ఐలమ్మ కళాభారతిని వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతం లో కళ ప్రదర్శన ప్రారంభించేందుకు వస్తే టౌన్ హాల్ శిధిలావస్థలో ఉందని కళాకారులు చెబితే కెసిఆర్ ని ఒప్పించి ఐలమ్మ కళాభారతికి రూ.7 కోట్ల నిధులు తీసుకువచ్చామని పేర్కొన్నారు. కళాకారులు ప్రదర్శనలు ఇచ్చేందుకు అవసరమైన వసతులు ఇందులో ఉన్నాయని, నాట్య ప్రదర్శనలు..కళ ప్రదర్శనలు..చిన్న వేడుకలు చేసుకునేందుకు కళా భారతి నిర్మాణం పూర్తి చేశామన్నారు.
పూర్తి చేసిన కళాభారతిని ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తేలేదు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు దీని మీద సమీక్షా చేసి దీనిని కళాకారులకు అందుబాటులోకి తేవాలన్నారు. టౌన్ హాల్ శిధిలావస్థలో ఉందని, దానిని తొలగించాలి. దాని స్థానంలో కార్పొరేషన్ కొత్త భవనం ఏర్పాటు చేయాలనీ ప్రణాళికలు ఉన్నాయని, ఒకసారి చూడాలన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యాటక శాఖ పరిధిలో పలు పనులు నిలిచి పోయాయని, మంత్రి జూపల్లి వాటిపై సమీక్షా చేసి పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, సీనియర్ నాయకులు నవకాంత్, ఈశ్వరయ్య, జహంగీర్, నరేందర్, గణేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






