22 August, 2026 | 10:24 PM

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

22-08-2026 08:13 PM

కాంగ్రెస్‌ నాయకత్వంపై ఆరోపణలు చేస్తే సహించేది లేదు

రాజకీయ కక్ష్యతోనే అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ

వైరా శాసన సభ్యులు రాందాస్ నాయక్

కారేపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని వైరా శాసనసభ్యులు మాలో రాందాస్ నాయక్ మండిపడ్డారు. కొండ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కాంగ్రెస్ అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే లక్ష్యంగా చేసుకుని కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై రాందాస్ నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

కొండా సుష్మిత తన లక్ష్యం కాంగ్రెస్ పార్టీ కాదని, సీఎం రేవంత్ రెడ్డేనని చెప్పడం పార్టీకి వ్యతిరేకమని తెలిపారు. పార్టీ నాయకత్వంపై బహిరంగంగా ఆరోపణలు చేయడం ద్వారా కార్యకర్తలు, నాయకుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలను సహించబోమని  స్పష్టం చేశారు. కొండ కుటుంబ సభ్యులు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ముఖ్యమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై అధిష్టానం కఠినంగా వ్యవహరించాలని కోరారు.

అమెరికా పర్యటనపై బీజేపీ బిఆర్ఎస్ కుట్ర

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన లండన్, అమెరికా పర్యటనల్లో అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం బిజెపి బిఆర్ఎస్ కుట్రలో భాగమని తెలిపారు. లండన్ పర్యటనకు కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ అమెరికా పర్యటనకు అనుమతి రాలేదు. దీంతో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడం రాజకీయపరమైన నిర్ణయమేనని ఆరోపించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడులు, విద్యా రంగంలో అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాల కోసం ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు చేపడుతున్నారని  పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపట్టే ముఖ్యమంత్రి పర్యటనలను రాజకీయాలకు అతీతంగా చూడాలని కోరారు.