ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కామళ్ళ నవీన్ మృతి
కార్మిక లోకానికి తీరని లోటు
నివాళులర్పించిన సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ, ఐఎఫ్‌టీయూ నాయకులు
గరిడేపల్లి,(విజయక్రాంతి): భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ కామళ్ళ నవీన్ శనివారం మృతి చెందారు. గత రెండేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నవీన్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం హుజూర్‌నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన వెలిదండ గ్రామానికి తరలించగా, సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం. డేవిడ్ కుమార్, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో కార్మిక వర్గ సమస్యలపై కామల్ల నవీన్ అలుపెరగని పోరాటాలు సాగించారని తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, కేజీబీవీ నాన్-టీచింగ్ సిబ్బంది, మోడల్ స్కూల్ హాస్టల్ వర్కర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు, స్కావెంజర్ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం రోడ్డెక్కి పోరాడారని వారు గుర్తుచేశారు.
చదువు లేకపోయినా ప్రాథమిక విద్యను పార్టీలోనే నేర్చుకున్న నవీన్, చిన్న వయసు నుంచే విప్లవ రాజకీయాలను ఒంటబట్టించుకుని దోపిడీ రహిత సమాజం కోసం పనిచేశారన్నారు. పోలీసుల నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఉద్యమ రహస్యాలను కాపాడిన నిబద్ధత కలిగిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. పెన్‌పహాడ్, గరిడేపల్లి ప్రాంతాలలోని గిరిజన గూడేలలో ప్రజలను చైతన్యవంతం చేయడంలోనూ, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడిగా కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాల్లో యువజన ఉద్యమాలను నిర్మించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో గరిడేపల్లి కేంద్రంగా ముందంజలో నిలిచారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు కునుకుంట్ల సైదులు, ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు మేకల రాజేశ్వరి, ఐఎఫ్‌టీయూ జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు, సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ వెలిదండ గ్రామ కార్యదర్శి మేకల కనకారావు, ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షులు కామళ్ళ శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు దుర్గా ప్రసాద్, పిట్ట నగేష్, గుంజ నరసింహారావు, గండికోట కొండలు, గ్రామ నాయకులు చనగాని పెద్ద సాంబయ్య, చింతమల్ల అంజయ్య, అరుణోదయ జిల్లా నాయకులు గండు నగేష్, వి. నరేష్, గండు రాంబాబు, గండు మల్లయ్య, పర్వతాలు, చామకూరి వెంకయ్య, కామళ్ళ ఆంథోనీ తదితరులు పాల్గొని నవీన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.






