ఎన్‌డీపీఎస్ కేసుల దర్యాప్తుపై పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
దర్యాప్తులో చిన్నపాటి లోపాలకు, తావులేకుండాచూడాలి
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
చుంచుపల్లి,ఆగస్టు 22, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌డీపీఎస్ చట్టానికి సంబంధించిన కేసుల దర్యాప్తుపై పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈగల్ ఫోర్స్ ఎల్.హెచ్. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శిక్షణా కార్యక్రమాన్ని శనివారం కొత్తగూడెం ఐఎంఈ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. శిక్షణలో ఎన్‌డీపీఎస్ కేసుల్లో నిందితుల గుర్తింపు, అరెస్టు, సీజ్ ప్రక్రియ, పంచనామా, సాక్ష్యాల సేకరణ, కేసు దర్యాప్తు, చార్జ్‌షీట్ దాఖలు తదితర అంశాల్లో పాటించాల్సిన చట్టపరమైన విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
అదేవిధంగా ఎన్‌డీపీఎస్ చట్టంలోని వివిధ సెక్షన్లు, వాటి అమలు విధానం, కోర్టు విచారణ సమయంలో ఎదురయ్యే అంశాలు, దర్యాప్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాక్ష్యాధారాల పరిరక్షణ తదితర అంశాలను వివరించారు. దర్యాప్తులో చిన్నపాటి లోపాలు కూడా కోర్టు విచారణ సమయంలో న్యాయపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నందున, ప్రతి దశలోనూ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని, ఎన్‌డీపీఎస్ కేసుల్లో దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచి నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా పటిష్టమైన ఆధారాలతో కేసులను దర్యాప్తు చేయాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎల్.హెచ్. రాజేశ్వరరావు సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ దర్యాప్తులో చోటుచేసుకునే లోపాలను గుర్తించి వాటిని సవరించుకోవడంతో పాటు, కేసుల పురోగతిపై పోలీసు అధికారులు శిక్షణలో తెలియజేసిన సూచనలు పాటించాలని సూచించారు. ప్రతి కేసులోనూ దర్యాప్తు అధికారులు చట్టపరమైన నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, పక్కా ఆధారాలతో కేసులను బలోపేతం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా శిక్షణా తరగతులు నిర్వహించి పోలీసు అధికారులకు, సిబ్బందికి చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎల్.హెచ్. రాజేశ్వరరావు, ఫణి కుమార్‌లను జిల్లా ఎస్పీ అభినందించి సన్మానించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, పాల్వంచ డిఎస్పి ఆర్.సతీష్ కుమార్, మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, ఇల్లందు డిఎస్పి వెంకన్న బాబు, భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.






