ఆల్ప్రాజోలం అక్రమ రవాణాదారులపై నిజామాబాద్ పోలీసుల ఉక్కుపాదం
డ్రగ్ అక్రమ రవాణాతో సంపాదించిన రూ.5.15 కోట్ల ఆస్తులు జప్తు
అంతర్రాష్ట్ర తయారీ, సరఫరా నెట్‌వర్క్‌పై పకడ్బందీ దర్యాప్తు
బోధన్,(విజయక్రాంతి): ఆల్ప్రాజోలం వంటి మత్తు పదార్థాల అక్రమ తయారీ, రవాణా, సరఫరా, విక్రయాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాపై నిజామాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. డ్రగ్ అక్రమ వ్యాపారం ద్వారా నిందితులు కూడబెట్టిన సుమారు రూ.5.15 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్ పర్యవేక్షణలో బోధన్ రూరల్ సీఐ డి. విజయ్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన దర్యాప్తులో అంతర్రాష్ట్ర ఆల్ప్రాజోలం తయారీ, సరఫరా నెట్‌వర్క్‌ను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఐదుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్
బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్ప్రాజోలం తయారీ, సరఫరాకు పాల్పడుతున్న ఐదుగురిపై గతంలో Cr.No.148/2025 కింద NDPS చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 2.5 కిలోల ఆల్ప్రాజోలం, రూ.25 లక్షల విలువైన మత్తు పదార్థం, స్కోడా కారు, ఎనిమిది మొబైల్ ఫోన్లు, రూ.2.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్రలో అక్రమ తయారీ కేంద్రం
నిందితులను పోలీస్ కస్టడీలో విచారించగా ఆల్ప్రాజోలం తయారీ, సరఫరాకు సంబంధించిన కీలక సమాచారం లభించింది. దీంతో సుమారు 15 మంది పోలీసులతో ప్రత్యేక బృందాన్ని మహారాష్ట్రకు పంపి వారం రోజుల పాటు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సతారా పారిశ్రామిక ప్రాంతంలో ‘సూర్య ప్రభ ఫార్మా కెమ్’ పేరుతో ఎరువుల తయారీకి అనుమతులు తీసుకుని, అక్రమంగా ఆల్ప్రాజోలం తయారు చేస్తున్న ఫ్యాక్టరీని గుర్తించారు. అక్కడ సోదాలు నిర్వహించి సుమారు 30 కిలోల ఆల్ప్రాజోలం, రూ.12 లక్షల నగదు, ఫోర్డ్ కారును స్వాధీనం చేసుకుని ఫ్యాక్టరీని సీజ్ చేశారు.
రూ.5.15 కోట్ల ఆస్తులపై జప్తు
డ్రగ్ అక్రమ వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మహారాష్ట్రలోని పూణే, సతారా, అహ్మద్‌నగర్ జిల్లాల్లోని సబ్‌రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాల నుంచి వివరాలు సేకరించి నిందితులు, వారి కుటుంబ సభ్యుల ఆస్తులను గుర్తించారు. A1 ఆమర్‌సింగ్, A2 బసవరాజ్, A5 లక్ష్మణ్ గౌడ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు డ్రగ్ అక్రమ విక్రయాల ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ విలువల ప్రకారం వీటి విలువ సుమారు రూ.5.15 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్‌లో విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. NDPS చట్టంలోని సెక్షన్ 68F(2) ప్రకారం సంబంధిత కాంపిటెంట్ అథారిటీల ఆదేశాలతో ఆస్తుల జప్తు చర్యలు చేపట్టారు. జప్తు చేసిన ఆస్తుల్లో 9.06 ఎకరాల వ్యవసాయ భూమి, 1,370 చదరపు గజాల ఖాళీ స్థలాలు, ఒక కెమికల్ ఫ్యాక్టరీ, నాలుగు నాలుగు చక్రాల వాహనాలు, రెండు ద్విచక్ర వాహనాలు, బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ.27 లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
సాంకేతిక పరిజ్ఞానంతో కీలక ఆధారాలు
కేసు దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన పోలీసులు నేరంతో సంబంధం ఉన్న సుమారు 20 మంది వ్యక్తుల మొబైల్ ఫోన్ సమాచారాన్ని విశ్లేషించారు. ఈ ఆధారాలతో డ్రగ్ తయారీ కేంద్రం, సరఫరా నెట్‌వర్క్‌తో పాటు అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను గుర్తించారు. దర్యాప్తు, న్యాయపరమైన ప్రక్రియ సుమారు ఏడాది పాటు కొనసాగినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్ ముఠాను ఛేదించడం నుంచి అక్రమ ఆస్తుల జప్తు వరకు సుమారు 15 మంది పోలీసు సిబ్బంది నిరంతరం కృషి చేశారని సీపీ పేర్కొన్నారు.
డ్రగ్ మాఫియాపై ఆర్థిక దెబ్బ
డ్రగ్ నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, మాదకద్రవ్యాల ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి జప్తు చేయడం ద్వారా డ్రగ్ మాఫియాపై ఆర్థికంగా కూడా గట్టి దెబ్బ కొట్టేలా చర్యలు కొనసాగిస్తామని సీపీ సాయి చైతన్య తెలిపారు.
మాదకద్రవ్యాల తయారీ, కొనుగోలు, రవాణా, నిల్వ, పంపిణీ, విక్రయాలు, ఆర్థిక లావాదేవీలపై నిరంతర నిఘా కొనసాగుతుందని, అంతర్రాష్ట్ర పోలీసుల సమన్వయంతో దర్యాప్తును మరింత విస్తృతం చేస్తామని వెల్లడించారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన బోధన్ రూరల్ సీఐ డి. విజయ్ బాబు, పోలీసు సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సీపీ సాయి చైతన్య సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్ నెట్‌వర్క్‌ల నిర్మూలనకు, ముఖ్యంగా యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రజల సహకారం అత్యంత కీలకమని సీపీ పేర్కొన్నారు.






