తెలంగాణలో ముదిరాజ్‌లే కాబోయే సీఎం
ఇండియన్ ఇన్‌క్లూసివ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఇంద్రజిత్ ప్రసాద్ గుప్తా
ముషీరాబాద్, మే 19 (విజయక్రాంతి): వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ముదిరాజ్ కులస్తులే కాబోయే సీఎం అని ఇండియన్ ఇన్‌క్లూసివ్ పార్టీ(ఐఐపీ) జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఇంద్రజిత్ ప్రసాద్ గుప్తా అన్నారు. అన్ని రంగాలలో వెనకబడి ఉన్న ముదిరాజ్‌లలో రాజకీయ చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఆయన ప్రకటించారు.
అనంతర ఐఐపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి డి.కె.మహోర్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 14 శాతం మంది ముదిరాజులు ఉన్నారని అన్నారు. కొన్ని రాష్ట్రాలలో ముదిరాజ్‌లు ఎస్సీలుగా, మరికొన్ని రాష్ట్రాలలో బీసీలుగా ఉన్నారని అన్నారు. ముదిరాజుల అభివృద్దే లక్ష్యంగా ప్రత్యేక పాలసీని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ముదిరాజులంతా ఒకే తాటిపైకి రావాలని, ఐఐపీని బలపరుస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ చేతుల్లో కీలుబొమ్మగా మారి దేశాన్ని లూటీ చేస్తుందని ఆరోపించారు. ఐఐపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మర్రి ప్రభాకర్ మాట్లాడుతూ వచ్చే జీహెచ్‌ఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా బట్టు హనుమంతురావు, నీలకంఠం, ప్రధాన కార్యదర్శిగా బాదరబోయిన రాఘవులు, న్యాయ సలహాదారులుగా డాక్టర్ కేబీ లక్ష్మి, ఉపాధ్యక్షులుగా బిక్షపతి, సంయుక్త కార్యదర్శిగా శ్రీనివాస్‌లను గుప్తా ప్రకటించారు.






