5 August, 2026 | 3:33 PM

మంథని ఏరియా ఆసుపత్రిలో మెరుగైన మాతా,శిశు వైద్య సేవలు

05-08-2026 02:38 PM

రెగ్యులర్ స్పెషలిస్ట్ వైద్యుల నియామకంతో విజయవంతంగా సిజేరియన్లు

మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన గర్భిణులు, ఆశా కార్యకర్తలు

మంథని,(విజయ క్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక శ్రద్ధ, చొరవతో మంథని ఏరియా ఆస్పత్రి రూపురేఖలు మారుతున్నాయి. మంత్రి నిరంతర కృషి ఫలితంగా ఆస్పత్రికి రెగ్యులర్ స్పెషలిస్ట్ వైద్యులు నియమితులై, మాతా-శిశు వైద్య సేవలు మరింత బలోపేతమయ్యాయి. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉచితంగా నాణ్యమైన వైద్యం అందుతుండటంతో మంథని నియోజకవర్గ ప్రజలు మంత్రి శ్రీధర్ బాబు పాలనా దార్శనికతపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రత్యేక చొరవలో భాగంగా బుధవారం మంథని మాతా-శిశు ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్ట్ డాక్టర్ మామిడిపల్లి స్రవంతి, అనస్థీషియా స్పెషలిస్ట్ డాక్టర్ గుంట మౌనిక, పీడియాట్రిషియన్ డాక్టర్ చిలకలపల్లి నరేష్ బృందం రెండు సిజేరియన్ (సి-సెక్షన్) శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ల ద్వారా ఇద్దరు శిశువులు (ఒక బాబు, ఒక పాప) జన్మించగా, తల్లులు మరియు నవజాత శిశువులు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

ఈ సందర్భంగా ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి.వి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రి శ్రీధర్ బాబు పట్టుదలతోనే ఆస్పత్రికి నిపుణులైన రెగ్యులర్ స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులోకి వచ్చారని స్పష్టం చేశారు. మంత్రి చొరవ వల్ల పేద, మధ్యతరగతి గర్భిణులు, చిన్నారులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అత్యుత్తమ వైద్యం అందుతోందని కొనియాడారు.

ఇకపై ప్రసవాల కోసం లేదా పిల్లల చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వేల రూపాయలు వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని, దూర ప్రాంతాలకు వెళ్లే శ్రమ కూడా తప్పిందని పేర్కొన్నారు. తమ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఏరియా ఆస్పత్రిని సర్వాంగ సుందరంగా, సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్న మంత్రి శ్రీధర్ బాబుకు గర్భిణులు, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మంథని ప్రాంత ప్రజలందరూ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కోరారు.