5 August, 2026 | 3:38 PM

డ్రగ్స్‌, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

05-08-2026 02:48 PM

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

రాజాపూర్ లో పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమంలో మంథని సీఐ బుద్దె స్వామి

మంథని,(విజయక్రాంతి) యువత గంజాయి, డ్రగ్స్‌, మద్యం వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండి విద్య, ఉపాధిపై దృష్టి సారించాలని మంథని సీఐ బుద్దె స్వామి పిలుపునిచ్చారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో రామగిరి ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమానికి సీఐ స్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని జీవితంలో విజయాలు సాధించాలని, మత్తు పదార్థాల బారిన పడితే భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నా లేదా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.

సైబర్ నేరాలపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. లక్కీ డ్రా, బహుమతులు, బ్యాంకు ఖాతా ధృవీకరణ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌, సందేశాలను నమ్మవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. అలాగే గ్రామాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, మూఢనమ్మకాల పేరుతో జరిగే మోసాలకు దూరంగా ఉండాలని కోరారు.

ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్‌, ట్రిపుల్ రైడింగ్‌, ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ-చలాన్ల ద్వారా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజాపూర్ గ్రామ సర్పంచ్ పుల్లెల్ల భాగ్యలక్ష్మి కొమురయ్య, ఉపసర్పంచ్ కళావేణి శ్రీకాంత్, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, గ్రామస్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.