5 August, 2026 | 3:32 PM

చికిత్సకు రూ.2.50 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్‌ఓసీ మంజూరు

05-08-2026 02:41 PM

దేవరాంపల్లి యువకుడికి అండగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతున్న మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం దేవరాంపల్లి గ్రామానికి చెందిన చీమల సాయి రాజ్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరోసారి అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆయన చికిత్స కోసం రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు.

చీమల నర్సింహులు కుమారుడు సాయి రాజ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు అయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సహాయకులు బాధిత కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీని అందజేశారు.

ఈ సందర్భంగా సాయి రాజ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, క్లిష్ట సమయంలో వెంటనే స్పందించి వైద్య సహాయం అందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తూ అవసరమైన ప్రతి కుటుంబానికి సీఎం సహాయ నిధి ద్వారా వైద్య సహాయం అందించేందుకు మంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు.