24 June, 2026 | 2:46 AM

పుస్తకాల వెనుక ప్రైవేట్ స్కూళ్ల సిండికేట్..?

24-06-2026 01:14 AM
  1. స్కూల్లోనే పుస్తకాల విక్రయాలు ఎందుకు..? 
  2. బయట దొరకని పుస్తకాలంటూ ఒత్తిడి ఎందుకు..? 
  3. షాపులతో పాఠశాలల ఒప్పందాలపై అనుమానాలు 
  4. తల్లిదండ్రుల జేబులకు చిల్లు ..

వనపర్తి, జూన్ 23 (విజయక్రాంతి):  విద్యార్థుల చదువుకు అవసరమైన పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్ విషయంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అనుసరిస్తున్న విధానంపై తల్లిదండ్రుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. విద్యను సేవగా భావించాల్సిన చోట వ్యాపార ధోరణి పెరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలల్లోనే పుస్తకాల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడం, నిర్దిష్ట దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలని సూచించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో తల్లిదండ్రులకు పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు, ఇతర సామగ్రి కొనుగోలు భారంగా మారుతోంది. సాధారణ మార్కెట్లో అందుబాటులో ఉండే వాటిని కూడా పాఠశాలల ద్వారా మాత్రమే తీసుకోవాలని చెప్పడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

‘మా స్కూల్ పుస్తకాలు బయట దొరకవు .’

కొన్ని పాఠశాలల నుంచి తల్లిదండ్రులకు ఇస్తున్న జాబితాల్లో ప్రత్యేకంగా సూచించిన పుస్తకాలు, నోట్బుక్స్ మాత్రమే కొనుగోలు చేయాలని చెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బయట మార్కెట్లో అదే తరహా పుస్తకాలు దొరికే అవకాశం ఉన్నప్పటికీ, ‘మా స్కూల్కు సంబంధించినవి ఇవే.. బయట తీసుకుంటే అంగీకరించరు‘ అంటూ ఒత్తిడి తెస్తున్నారని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లల చదువు విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితుల్లో పాఠశాలలు సూచించిన చోటే కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు.

పుస్తకాలతో పాటు ప్యాకేజీల మోత.. 

కొన్ని పాఠశాలల్లో పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్, షూ, టై, బెల్ట్ తదితర వస్తువులను ఒకే ప్యాకేజీగా అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట మార్కెట్లో తక్కువ ధరకు లభించే వాటిని పాఠశాలల ద్వారా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి విద్యార్థి నుంచి వచ్చే ఈ అదనపు వసూళ్లు ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

షాపులతో లోపాయికారీ ఒప్పందాలా..? 

కొన్ని పాఠశాలలు ప్రత్యేక దుకాణాలను మాత్రమే ఎందుకు సూచిస్తున్నాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పుస్తకాల విక్రయాలు, యూనిఫామ్ల సరఫరా విషయంలో పాఠశాలల యాజమాన్యాలకు, వ్యాపార సంస్థలకు మధ్య ఏమైనా అవగాహన ఒప్పందాలు ఉన్నాయా..? అనే అనుమానాలు తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో పుస్తకాలు, ఇతర సామగ్రి విక్రయాలు పెద్ద మొత్తంలో సాగుతుండటంతో ఇది ఒక ప్రత్యేక వ్యాపారంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నిబంధనలు ఉన్నా.. అమలు ఏదీ..? 

విద్యార్థులు, తల్లిదండ్రులపై ఎలాంటి కొనుగోలు ఒత్తిడి ఉండకూడదని నిబంధనలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు మారడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో ఇలాంటి వ్యవహారాలపై విద్యాశాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు కనిపించడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. విద్య పేరుతో సాగుతున్న ఈ వ్యాపార ధోరణికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. పుస్తకాల కొనుగోలు వ్యవహారంలో పారదర్శకత తీసుకురావాలని, తల్లిదండ్రులకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

వాస్తవ పరిస్థితులపై విద్యాశాఖ చర్యలు తీసుకునేనా..? 

ఈ అంశంపై విద్యాశాఖ అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులను పరిశీలించి చర్యలు తీసుకుంటారా..? లేక పుస్తకాల దందా యథావిధిగా కొనసాగుతుందా..? అనేది వేచి చూడాలని విద్యావేత్తలు చర్చించుకుంటున్నారు