26 March, 2026 | 3:07 AM

డ్యూటీ కావాలంటే రూ.50 వేల ఇయ్యాల్సిందే

26-03-2026 01:05 AM
  1. ఫాగింగ్ వర్కర్‌ను వేధించిన సీనియర్ ఎంటమాలజిస్ట్ అధికారి గంగప్ప 
  2. అనారోగ్యం నుంచి కోలుకొచ్చిన కార్మికుడిపై కనికరం లేని వేటు..
  3. నేడు కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్న యూనియన్ నేతలు..

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 25 (విజయక్రాంతి): నీ ఉద్యోగం ఉండాలంటే రూ. 50 వేలు సమర్పించుకోవాల్సిందే అని ఓ సీనియర్ ఎంటమాలజిస్ట్ ఓ ఫాగింగ్ వర్కర్‌కి హుకుం జారీ చేయడం జీహెచ్‌ఎంసీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రాయణగుట్ట సర్కిల్, వార్డు నం. ఇ.ఏ 022 లో ఫాగింగ్ వర్కర్‌గా పనిచేస్తున్న పురణ్ దాస్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో విధులకు రాలేకపోయారు.

కోలుకున్నాక ఈ నెల 6న విధులకు హాజరయ్యారు. వరుసగా మూడు రోజులు పనిచేసి అటెండెన్స్ కూడా వేయించుకున్నారు. అయితే, నిన్ను విధుల్లో కొనసాగించాలంటే సీనియర్ ఎంటమాలజిస్ట్ గంగప్ప కు రూ. 50 వేలు ఇవ్వాలని సూపర్‌వైజర్ ద్వారా బేరం పెట్టారు. అప్పటికే ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పులు చేసిన పురణ్ దాస్.. అంత డబ్బు తనవద్ద లేదని మొరపెట్టుకున్నారు. దీంతో కక్ష గట్టిన ఎస్‌ఈ గంగప్ప, పర్యవేక్షణ పేరుతో ఫీల్డ్‌కు వచ్చి నీవు చాలా రోజులు డ్యూటీకి రాలేదు..

నిన్ను విధుల్లోంచి ఆపుతున్నాను అని నోటిమాటతోనే ఉద్యోగం నుంచి తొలగించారు. ఎస్‌ఈ గంగప్పపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘం నేత కుమ్మకల బాలకృష్ణ డిమాండ్ చేశారు. బాధితుడు పురణ్ దాస్‌ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, గంగప్పపై  చర్యలు తీసుకోవాలని కోరు తూ గురువారం అడిషనల్ కమిషనర్, కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

రూల్స్ ప్రకా రమే తొలగించాం అని గంగప్ప చెబుతున్నప్పటికీ, మరి మూడు రోజుల పాటు అటెండెన్స్ వేసి పనిచేయించుకున్నది ఎవరనే ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం లేదు.  విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.