26 March, 2026 | 4:32 AM

మహిళల ఆర్థిక బలోపేతానికి చర్యలు

26-03-2026 01:05 AM
  1. కలెక్టర్ రాజర్షిషా 

ఆదిలాబాద్ జిల్లాలో తొలి మహిళా మార్ట్‌ను ప్రారంభించిన కలెక్టర్

ఆదిలాబాద్/ఉట్నూర్, మార్చి 25 (విజయక్రాంతి):  మహిళా సాధికారత దిశగా అదిలాబాద్ జిల్లా మరో ముందడుగు వేసిందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవా రం జిల్లా మహిళా సమాఖ్య, సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన తొలి ‘అదిలాబాద్ మహిళా మార్ట్‘ ను  మునిసిపల్ చైర్ పర్సన్ బండారి అనూషతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని మహిళా సంఘాలు తయారు చేస్తున్న సుమారు 30 రకాలకు పైగా నాణ్యమైన ఉత్పత్తులు ఈ మార్ట్‌లో లభ్యమవుతాయని తెలిపారు. పట్టణ నడిబొడ్డున, ప్రధాన రహదారి పక్కనే ఈ మార్ట్‌ను ఏర్పాటు చేయడం వల్ల వినియోగదారులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన వస్తువులు నేరుగా అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యం గా ఆదివాసీలు తయారు చేసే ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులకు, అటవీ ఉత్పత్తులకు ఇక్కడ ప్రత్యే క ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ’మేడ్ ఇన్ అదిలాబాద్ - ఫర్ అదిలాబాద్’ అనే నినాదంతో ప్రారంభమైన ఈ మార్ట్, భవిష్యత్తులో హైదరాబాద్లోని ఐఎంఎస్ బజార్ తరహాలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ అనూష మాట్లాడుతూ... జిల్లాలో మహిళా సంఘాల ద్వారా తయారైన ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ వినూత్న విక్రయ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా మహిళలు వ్యాపార రంగం లోనూ రాణించడం గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రవీందర్, వార్డ్ కౌన్సిలర్ కలాల శ్రీనివాస్, మహిళా సమైఖ్య సభ్యులు లక్ష్మి, బృందన, మంజుల, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఇతర అధికారులు, తదితరులు  పాల్గొన్నారు. 

చదువుతోపాటు క్రీడల్లో రాణించే విధంగా ప్రోత్సహించాలి..

ఏకలవ్య మోడల్ స్కూల్‌లో విద్యనభ్యసించే విద్యార్థులకు నాణ్యతమైన విద్యను అందించడంతో పాటు క్రీడల్లో రాణించే విధంగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ రాజర్శి షా ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. బుధవారం ఇంద్రవెల్లి మండలంలోని  పాట గూడ లోని ఏకలవ్య మోడల్ స్కూల్  ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతులు, విద్యార్థుల హాజరు శాతం, భోజన మెనూ పరిశీలిం చి, పాఠశాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

అనంతరం వసతి గృహంలోని పలువురు విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారికి అందుతున్న భోజన వసతి, నాణ్యత, ఇతర సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ ఇంగ్లీష్ భాష పై  పట్టు సాధించడంతో పాటు ప్రతి సబ్జెక్టు పై  నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. మరోపక్క విద్యార్థులకు పలు ప్రశ్నలు సంధిం చి జవాబులను రాబట్టారు.

మోడల్ స్కూల్ లో చదువుకునే విద్యార్థులకు వాకింగ్ కోసం మరమ్మత్తులు చేపట్టి త్వరలో విద్యార్థులకు అందుబాటులో తీసుకొస్తామని  అన్నారు. మెడల్ స్కూల్లోని స్టోర్ గదిని పరిశీలించి, కోడిగుడ్లను తూకం వేసి చూయించారు. విద్యా ర్థులకు వడ్డించే  భోజన సరుకులను నాణ్యతగా ఉన్నాయా లేవని పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, మెడల్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ రేఖ రాణి, ఐటీడీఏ  ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఈ ఈ శివ ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.