బడ్జెట్‌పై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు
- పేదల సంక్షేమంపై మాట్లాడుతుంటే పారిపోయారు
- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎన్ని కోట్లయినా ఇస్తాం
- అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని పేదల సంక్షేమం గురించి అసెంబ్లీలో వినడానికి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యులకు మనసు లేదని, అందుకే బడ్జెట్ సమాధానం వినకుండా సభ నుంచి పారిపోయారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధ వారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
‘గత పాలకులు మాయమాటలు చెప్పి, ప్రజల్లో భ్రమలు కల్పించి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని ఓట్లు వేయించుకున్నారు. కానీ, పదేళ్ల అధికారంలో ఏ ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వకుండా వారిని గాలికి వదిలేశారు‘ అని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉన్నత లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, అదే స్ఫూర్తితో నేడు తమ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని గుర్తుచేశారు.
బడ్జెట్ ప్రతులను చింపి, చెవిలో పెట్టుకుని వెళ్లిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. ‘పేదలు ఇల్లు కట్టుకుని ఆత్మగౌరవంతో బతకడం విపక్షాలకు ఇష్టం లేదు. బడ్జెట్లో నిధులు తగ్గించామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఏకంగా రూ. 22,500 కోట్లు కేటాయించాం’ అని స్పష్టం చేశారు.
హౌసింగ్ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పనులు వేగవంతం చేసేందుకు గతంలో లాగా నెలల తరబడి వేచిచూడకుండా, వారానికోసారి బిల్లులు చెల్లించేలా నిక్కచ్చిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. ‘ఇల్లు కట్టండి.. బిల్లు తీసుకోండి’ అనే నినాదంతో లబ్ధిదారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నామని, ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ పేదల కోసం వెనకడుగు వేయలేదన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకానికి నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణం ఇంకా వేగవంతం కావాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. ఇప్పటివరకు లబ్ధిదారులకు చెల్లించిన బిల్లులు రూ. 5,000 కోట్లు దాటలేదని, ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాల్లో పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
నిర్మాణాలు ఎంత వేగంగా జరిగితే, అంత త్వరగా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదన్న ఆశయంతో పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
పెద్దఎత్తున గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి..
గ్రీన్ ఎనర్జీని రాష్ట్రంలో పెద్దఎత్తున ఉత్పత్తి చేయాలన్న ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకొని సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలన చేస్తుందన్నారు. బుధవారం అసెంబ్లీలో సోలార్ పవర్‌పై ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో గృహ ఉపయోగ, వ్యవసాయ రంగానికి సంబంధించి 81 గ్రామాల్లో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 38,216 గ్రామాలు, 16,078 వ్యవసాయ పంప్ సెట్‌లకు సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
గృహ ఉపయోగ రూఫ్ టాప్ సోలార్ కింద పీఎం సూర్య ఘర్ ప్రభుత్వ బిజిలీ కింద 40, 349 గృహాల్లో టు కే సామర్థ్యం రూట్ ఆఫ్ సోలార్ ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయ సేవలు కింద పీఎం కుసుమ్ కాంపోనెంట్స్ కింద 7.5 కిలోవాట్ హై రైజ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా 16,708 వ్యవసాయ సోలార్ పంపుసెట్లు ఏర్పాటుచేసినట్టు వివరించారు.




